సూపర్ స్టూడెంట్స్
ఐసీడబ్ల్యూఏలో ఆలిండియా ర్యాంకులు సాధించిన సూపర్‌విజ్ విద్యార్థులు
ఫైనల్లో 47వ ర్యాంకు సాధించిన నగరానికి చెందిన అంధుడు నాగరవితేజ
కలలు అందరూ కంటారు.. వాటిని సాకారం చేసుకునే వారే నిజమైన విజేతలవుతారు. ఒకరు ప్రపంచాన్ని చూడలేని అంధుడు.. మరొకరు సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు.. ఇంకొకరు తల్లిదండ్రుల ఆశలనే ఊపిరిగా భావించి ముందుకు కదులుతున్నారు.. దారులు వేరైనా వీరి గమ్యం మాత్రం ఒక్కటే. అదే ఐసీడబ్ల్యూఏ. నిరంతర కృషి, సత్తా ఉంటే గానీ సాధించలేని లక్ష్యాన్ని ఈ ముగ్గురు అలవోకగా ఛేదించారు. నగరంలోని సూపర్‌విజ్‌లో చదువుకుంటున్న ఈ విద్యార్థులు ఐసీ డబ్ల్యూఏలో ఆలిండియా స్థాయిలో ర్యాంకులు సాధించి ప్రతిభ చాటారు. తల్లిదండ్రుల సహకారం, సూపర్‌విజ్ కృషితోనే తాము ఈ విజయం సాధించామని చెబుతున్న ఈ ‘సూపర్’ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే..
- లబ్బీపేట
కళ్లు లేకపోయినా అందరి ప్రోత్సాహంతో..
నేను లయోల కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడు సూపర్‌విజ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్‌లో నన్ను చూసిన గుప్తాగారు (సూపర్‌విజ్ ఎండీ) అంధత్వం మనిషికే కానీ మనసుకు కాదని, ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా నిరాశపడకుండా ప్రయత్నాన్ని కొనసాగించాలని చెప్పిన మాటలకు ఆకర్షితుడనై సీఏ చేయాలని నిర్ణయించుకున్నా. సీఏ సీపీటీ శిక్షణలో చేరినపుడు మొదట్లో కొంత ఇబ్బందే ఎదురైనా గుప్తాగారు ప్రత్యేకంగా రీసెర్చి చేసి రూపొందించిన బ్లైండ్ టెక్నిక్స్ నాలో నూతనోత్సాహాన్ని నింపాయి. దీంతో సీఏ, సీపీటీ, ఐపీసీసీ పూర్తిచేసి ఫైనల్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఐసీడబ్ల్యూఏ కోర్సును పూర్తిచేసి ఫైనల్లో ఆలిండియా స్థాయిలో 47వ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ర్యాంకు సాధించడానికి సూపర్విజ్తో పాటు మా అమ్మానాన్న, సోదరి కృషి కూడా ఎంతో ఉంది. నాన్న సాంబశివరావు ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ చేశారు. అమ్మ గృహణి, సోదరి ప్రస్తుతం ఎంటెక్ చేస్తోంది. నాకు చూపు లేకపోయినా వారి ప్రోత్సాహంతో ముందుకుసాగుతున్నా. ఇదే స్ఫూర్తితో సీఏ పూర్తిచేసి మంచి ఉద్యోగం చేయాలనేదే నా ఆకాంక్ష. అందుకు నిరంతరం కృషిచేస్తా. అమ్మానాన్న, గుప్తాగారు, ఇతర అధ్యాపకులకు కృతజ్ఞతలు. - కంచర్లపల్లి నాగరవితేజ,
ఐసీడబ్ల్యూఏ ఫైనల్ 47వ ర్యాంకర్, విజయవాడ, అంధుడు
కన్నవారి కల నెరవేరింది..
ప్రకాశం జిల్లా వేములపాడుకు చెందిన వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఇంటర్మీడియెట్ చదువుతున్నపుడు సీఏ చేయాలన్న ఆకాంక్ష కలిగింది. నాన్న కృష్ణయ్య వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ రమణమ్మ గృహిణి. ఈ విషయాన్ని వారికి చెప్పగా, నువ్వేమి కోరుకుంటున్నావో దానినే కష్టపడి సాధించాలని ఆశీర్వదించి పంపించారు. వారి ఆకాంక్షను ఎన్నడూ విస్మరించలేదు. అమ్మానాన్న పడిన కష్టాల నుంచి పొందిన స్ఫూర్తితో, సూపర్‌విజ్ టెక్నిక్స్‌తో నేడు ఐసీడబ్ల్యూఏ ఇంటర్లో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాను. ఈ విషయాన్ని అమ్మానాన్నకు ఫోన్‌చేసి చెప్పాను. వారి ఆనందానికి అవధుల్లేవు. నాకు తగిన ప్రేరణ ఇచ్చి ఎలాగైనా పాస్ అవ్వాలనే పట్టుదల కలిగించిన గుప్తాగారి కృషిని నేను జీవితాంతం మరిచిపోలేను. గుప్తాగారు చెప్పిన టెక్నిక్స్ ఎవరు పాటించినా కచ్చితంగా ర్యాంకులు సాధించగలరు. ఈ ఫస్ట్ ర్యాంకును అమ్మానాన్నకు బహు మతిగా ఇవ్వడంతో నా కల నెరవేరింది. సీఏ ఫైనల్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సంపాదించడమే నా లక్ష్యం.
- మద్దినేని లక్ష్మీనారాయణ,
ఐసీడబ్ల్యూఏ ఇంటర్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్
మంచి ఉద్యోగం సాధిస్తా..
మాది ఉయ్యూరు. మా నాన్న ధనరాజ్ చిరు వ్యాపారం చేస్తుంటారు. నన్ను చార్టెడ్ అకౌంటెంట్‌గా చూడాలనేది మా అమ్మానాన్న ఆకాంక్ష. అందుకే నగరంలోని సూపర్‌విజ్‌లో చేర్చారు. ఇక్కడ ఇస్తున్న శిక్షణ, వారు చెప్పే టెక్నిక్స్ పాటిస్తూ ప్రతి పరీక్షలో విజయం సాధించా. ప్రస్తుతం సీఏ సీపీటీ, ఐపీసీసీ పూర్తిచేశాను. ఐపీసీసీలో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంకు సాధించా. ఇప్పుడు ఐసీడబ్ల్యూఏ ఇంటర్లో ఆలిండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం ద్వారా నా తల్లిదండ్రుల కలలను నిజం చేశా. ఇదే స్ఫూర్తితో సీఏ, ఐసీడబ్ల్యూఏ ఫైనల్స్ పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధిస్తా. సూపర్‌విజ్‌లో చేరిన సాధారణ విద్యార్థులు సైతం ర్యాంకులు సాధించగలరని నేను నిరూపించాను. ఈ ర్యాంకు సాధించడానికి తోడ్పాటునిచ్చిన అమ్మానాన్న, సూపర్‌విజ్ అధ్యాపకులకు నా కృతజ్ఞతలు.
- కంతేటి ఉపేంద్ర,
ఐసీడబ్ల్యూఏ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్, ఉయ్యూరు
రోజుకు 13 గంటలు చదివా..
మధురానగర్‌లోని పసుపుతోటలో ఉంటున్న సాధారణ కుటుంబానికి చెందిన తాపీమేస్త్రి కుమార్తె ముక్కామల స్వాతి ఐసీ డబ్ల్యూఏలో జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించింది. దీంతో తండ్రి శ్రీనివాసరావు, తల్లి విజయలక్ష్మి ఆనందంతో మంగళవారం పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాతి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థానానికి చేరుకుంటానన్నారు. ఈ ర్యాంకు రావటానికి తాను రోజుకు 13 గంటల చదివానని, సూపర్‌విజ్ డెరైక్టర్ గుప్తా టెక్కిక్స్, తల్లిదండ్రుల పోత్సాహంతోనే ఈ ఘనత సాధించానని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకుంటానని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా స్వాతిని స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతిని నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన నియోజకవర్గంలో ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమెకు ప్రభుత్వపరంగా అవసరమైన సహాయ సహ కారాలు అందజేస్తానని బొండా ఉమా హామీ ఇచ్చారు. - మధురానగర్