కదలిక లేని నివేదిక!
సూపరింటెండెంట్‌పై ‘ఆడిట్’ విచారణ
ఏడు నెలలైనా చర్యలు శూన్యం
ఖమ్మం సంక్షేమ విభాగం : అడ్డదారుల్లో పదోన్నతి పొందిన వ్యక్తిపై విచారణ చేసి ఏడు నెలలు గడిచినా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఖమ్మం డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ సీహెచ్.శ్రీనివాస్‌పై ఆడిట్ ఆధికారులు జనవరి 5న విచారణ చేపట్టారు. గతంలో ఆయన కరీంనగర్లో పనిచేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగోన్నతి పొందినట్లు డి.కనకయ్య అనే ఇతడి సహోద్యోగి ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆడిట్ అధికారి రాజు, సీనియర్ ఆడిటర్ శ్యాంప్రసాద్.. శ్రీనివాస్ వద్ద నుంచి లిఖితపూర్వక వాగ్మూలం తీసుకోవడంతోపాటు ఆయన సర్వీసు రిజిస్టర్‌ను పరిశీలించారు.
కనకయ్య చేసిన ఫిర్యాదు ప్రకారం శ్రీనివాస్, కనకయ్య ఒకేసారి ఉద్యోగంలో చేరినప్పటికీ శ్రీనివాస్ తన సర్వీసు పుస్తకంలో కొన్ని పేజీలను తొలగించి.. కొన్ని వివరాలు అదనంగా చేర్చి ప్రభుత్వాన్ని మోసం చేసి.. రెండు అదనపు ఇంక్రిమెంట్లు, ఒక ప్రమోషన్ పొందినట్లు పేర్కొన్నారు. పైగా సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు కూడా జవాబు ఇవ్వకపోవడం పట్ల కనకయ్య రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కరీంనగర్లో గతంలో విచారణ జరగగా.. అనంతరం శ్రీనివాస్ బదిలీపై ఖమ్మం రావడంతో ఖమ్మంలో 2015, జనవరి 5న విచారణ చేపట్టారు. విచారణ వివరాలను కలెక్టర్‌కు అందజేయనున్నట్లు విచారణ అధికారులు ఆ సమయంలో తెలిపారు. కాగా, ఇప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి కదలిక కనిపించలేదు. దీంతో కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.