ప్రభుత్వ బ్యాంకులకు 12 వేల కోట్ల అదనపు నిధులు
న్యూఢిల్లీ : ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం పార్లమెంటులో తన మొట్టమొదటి సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌ను ప్రవేశపెట్టారు. ఈ మొత్తం దాదాపు రూ.25,500 కోట్లు. స్థూలంగా రూ.40,822 కోట్ల వ్యయాలకు అనుమతి కోరితే... పొదుపులు లేదా పెరిగిన వసూళ్లు, రికవరీలు అన్నీ (దాదాపు రూ.15,326 కోట్లు) పోనూ నికర నగదు వ్యయ డిమాండ్ రూ.25,500 కోట్లు. ఇందులో సగం బ్యాంకులకు తాజా మూలధన కేటాయింపులకు (దాదాపు రూ. 12,000 కోట్లు) కావడం గమనార్హం. బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులకు పేర్కొన్న నిధులకు అదనంగా... మరేదైనా ఆర్థిక అవసరాలు ఏర్పడితే... అందుకు పార్లమెంటు అనుమతి తప్పనిసరి. సప్లిమెంటరీ డిమాండ్స్ రూపంలో కేంద్రం ఈ(గ్రాంట్ల) డిమాండ్‌ను పార్లమెంటు ముందు ఉంచుతుంది. నేటి సప్లిమెంటరీ గ్రాంట్స్ డిమాండ్ 2015-16 బడ్జెట్లో రూ.17.17 లక్షల కోట్ల వ్యయ ఆమోదాలకు అదనం. తాజా డిమాండ్స్‌లో ముఖ్యాంశాలు..
►ఇండియన్ స్ట్రేటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ విశాఖపట్నంలో నిర్మిస్తున్న తొలి వ్యూహాత్మక క్రూడ్ ఆయిల్ నిల్వలకు సంబంధించి క్రూడ్ కొనుగోలుకు రూ.1,153 కోట్లు...
►తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎయిర్ ఇండియాకు అదనంగా రూ.800 కోట్ల కేటాయింపు
►స్వచ్ఛ్ భారత్ మిషన్, మంచినీరు-పారిశుధ్ధ్యం పథకాలకు రూ.2,685 కోట్లు.
►ముద్రా బ్యాంక్ ఏర్పాటుకు రూ.100 కోట్లు.
►చెన్నై-బెంగళూరు మెట్రో ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.1,000 కోట్లు.
కాగా ఆగస్టు 4 సమీక్ష నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ రాజన్ సమావేశమయ్యారు.