రక్తహీనత నివారణకు డీ వార్మింగ్ మాత్రలు
ఏలూరు అర్బన్: డీ వార్మింగ్ డేను పురస్కరించుకుని పిల్లల్లో రక్తహీనతకు కారణమవుతున్న నులిపురుగల నివారణకు సోమవారం జిల్లావ్యాప్తంగా డీ వార్మింగ్ మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నామని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ కె.కోటేశ్వరి తెలిపారు. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో నులిపురుగుల నివారణ మాత్రలు అందించేందుకు 6,03,669 మంది చిన్నారులను గుర్తించామన్నారు.
వారిలో ఒకటి నుంచి రెండేళ్లలోపు వయసున్న చిన్నారులకు ఒక మాత్రలో సగభాగం డోసుగా ఇవ్వాలని, రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి పూర్తి మాత్ర అందించాలని చెప్పారు. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మాత్రల పంపిణీ కార్యక్రమాలు చేపడతామన్నారు. అన్ని పీహెచ్సీల్లో కూడా మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణలో చిన్నారులు మాత్రలు వేసుకోవాలని, ఖాళీ కడుపుతో మాత్రలు మింగడం చేయకూడదని స్పష్టం చేశారు. ఆర్బీఎస్కే జిల్లా కో–ఆర్డినేటర్, డాక్టర్ కె.సురేష్ బాబు, డెమో, సీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.