లెన్స్ అండ్ సురభి
వారిది సాటిలేని నటనా చతురత.. వీరిది వైవిధ్యమైన
కళా దృశ్యాలను ఒడిసిపట్టాలనే తపన.. వెరసి నాంపల్లి
పబ్లిక్‌గార్డెన్స్‌లోని సురభి ఆడిటోరియంలో ప్రద ర్శితమయ్యే నాటకాలపై ఆధునికులు మనసు పారేసుకుంటున్నారు.
ఫొటోగ్రఫీ క్రేజ్ పుణ్యమో.. వైవిధ్యమైన దృశ్యాలకు అందమైన రూపం ఇవ్వాలనే ఆత్రమో గాని సురభి ఆడిటోరియంలో సిటీజనుల కెమెరాలు క్లిక్‌మంటున్నాయి. అపురూపమైన కళాభినివేశాలను తమలో ఇముడ్చుకుంటున్నాయి. జీవన దిలా సాగిపోయే ఆ అభినయ ఝరిని.. మరింత ఉన్నతంగా, వైవిధ్యంగా చూపించాలని పరితపిస్తున్నాయి. వీకెండ్స్‌లో సురభి కళా నిలయం వైపు అడుగులేస్తున్న ఫొటోగ్రాఫర్లలో కొందరు అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఏదేమైనా నగరంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న ఈ ట్రెండ్ పుణ్యాన ఈ అజరామర కళారూపం మరింతగా నగరవాసులకు చేరువవుతుందని కళాభిమానులు ఆశిస్తున్నారు.
తొలిసారి 2010లో సురభి ప్రదర్శనకు వెళ్లాను. నిజంగా అద్భుతం. అక్కడ ఏ ఫొటోగ్రాఫర్కైనా కావాల్సినంత ముడిసరుకుంది. అన్నింటికన్నా ఆ కళాకారుల్లో కనపడే స్వచ్ఛతకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అంత గొప్ప సురభి గురించి ప్రపంచానికి చాటి చెప్పాలంటే, ఆ కళావైభవానికి మరింత ప్రాచుర్యం కల్పించాలంటే అందుకు ఫొటోగ్రఫీ ఒక చక్కని మార్గం. అక్కడ నేను తీసిన ఒక ఫొటోకు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ మూమెంట్ అవార్డ్ లభించింది.
- చంద్రశేఖర్ సింగ్
నూటపాతికేళ్ల సురభి నాటక కళామండలిని పరిశీలించడమే ఓ అద్భుతం. అపూర్వ ధారణ శక్తితో సందర్భోచితంగా సాగిపోయే వారి అభినయం మహాద్భుతం. ఈ కాలంలోనూ భారతీయ నాటకం బతికుందంటే.. కళామూర్తుల తృష్ణ ఎంత గొప్పదో తెలుస్తుంది. ఎల్లలు లేని వారి కళాభినివేశాన్ని నిశ్శబ్దంగా నా కెమెరాలో బంధించాను. భగవంతుడే తన కళ్లను అరువిచ్చి నా కెమెరాతో ఆ అపురూప దృశ్యాలను నిక్షిప్తం చేసే భాగ్యం కల్పించాడన్పిస్తోంది.
- మామిడి చైతన్యకుమార్
తరచూ సురభిని సందర్శించి మరిన్ని ఫొటోలు తీయాలనుకుంటున్నాను. ఆ లైట్స్, యాక్షన్, సాంకేతిక విలువలు.. ఎంత గొప్పగా ఉన్నాయో.. ఇది సింగిల్‌షాట్‌లో తీసిన ఒక లో-బడ్జెట్ హాలీవుడ్ మూవీకి సరిసాటి. నమ్ముకున్న కళను బతికించుకోవడానికి వీరు చేస్తున్న కృషికి జోహార్లు. మల్టీప్లెక్స్‌లు వదిలిపెట్టి ఈ లైవ్మూవీని చూడండి. నాటకం మీ మనసు దోచుకుంటుందని నేను హామీ ఇస్తున్నాను.
-యర్రమిల్లి అభిలాష్
ఆర్టిస్టులు మేకప్ చేసుకుంటున్న ప్రాంతంలో అకస్మాత్తుగా ఆ తరం రంగస్థల నటి పద్మజా వర్మ కనపడింది. మేకప్ చేసుకుంటున్న ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అసంకల్పితంగానే నా కెమెరా స్పందించింది. నాటకం నానాటికీ ప్రాభవం కోల్పోతున్నా.. సడలని అంకితభావానికి ప్రతిబింబంలా కనిపించిన ఆ దృశ్యాన్ని బంధించాను. దీనికి అలయెన్జ్ ఫ్రాంచైజ్ వరల్డ్ ఫొటో కాంపిటీషన్లో రన్నరప్ ప్రైజ్ లభించింది. ఈ గుర్తింపు అపూర్వ కళకు ఫొటోగ్రఫీ కళ కట్టిన పట్టంగా భావిస్తున్నా.
-స్వారత్