సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి
బొబ్బిలి: తమ వంశమంతా సురభి కళాకారులమేనని, ఒకవైపు తాను నాటకాలు వేస్తూనే మరో వైపు టీవీ, సినిమాల్లో నటిస్తున్నానని నటి సురభి ప్రభావతి అన్నారు. బొబ్బిలి వచ్చిన సందర్భంగా బుధవారం రాత్రి ఆమె సాక్షితో మాట్లాడారు. తమ కుటుంబంలో పుట్టుకతోనే నటనలో ఉంటామన్నారు. అందుకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చామో, ఎన్ని అవార్డులు వచ్చాయో లెక్కలేవన్నారు. బతుకమ్మ, మహాత్మ సినిమాల్లో తాను నటించానని చెప్పారు. టీవీ సీరియల్స్‌లో కలవారి కోడలు, పూత రేకుల్లో నటించానని, ఇంకా సీరియల్స్‌లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు.
నెల్లూరులో తాను ప్రదర్శించిన బాపుబాటలో నాటకానికి, ఖమ్మంలో వేసిన విప్రనారాయణ పద్యనాటకంలో దేవదేవి పాత్రకు, గుంటూరులో వేసిన వీరపల్నాడులో నాగమ్మ పాత్రకు తనకు నంది అవార్డులు వచ్చాయని తెలిపారు. తిరుపతిలో జరిగిన పోటీల్లో గరుడ అవార్డు కూడా ఇచ్చారన్నారు. ఉదయ్ భాగవతుల రచన, దర్శకత్వంలో వేసిన బొమ్మ సముద్రం నాటకానికి మంచి పేరు వచ్చిందన్నారు. ఆ నాటకాన్ని 50 సార్లు ప్రదర్శిస్తే 40 సార్లు ఉత్తమ నటిగా గుర్తింపు వచ్చిందన్నారు. ఖాళీలు పూరించండి, కొత్త బానిసలు నాటకాలకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. టీవీసీరియల్స్, సినిమాలకు అవకాశం వస్తున్నా నాటకానికే తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు.