15 నుంచి జేపీ సురాజ్య యాత్ర
అక్కయ్యపాలెం (విశాఖ ఉత్తరం): భ్రష్టుపట్టిపోతున్న రాజకీయవ్యవస్థపై ప్రజల్లో చైతన్యం తెచ్చి మంచి రాజకీయాల వైపు వారిని మళ్లించేందుకు లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ రాష్ట్రంలో వందరోజుల సురాజ్య యాత్ర చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి చెప్పారు. అక్కయ్యపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జేపీ చేపట్టనున్న సురాజ్య యాత్ర ఈ నెల 15న విశాఖ జిల్లా నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.
విశాఖ జిల్లాలో 5 రోజులపాటు యాత్ర కొనసాగుతుందని, యువత, రైతులు, బీసీలు, దళితులు, మధ్యతరగతి ప్రజలతో జేపీ సమావేశమవుతారని చెప్పారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం పోరాడనున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం వంటివి లంచాలు లేకుండా అందే పరిస్థితి లేదని, ప్రజల్లో ప్రశ్నించేతత్వం వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని, ఆ మేరకు ప్రజలో చైతన్యం తెచ్చేలా జేపీ యాత్ర సాగుతుందని బాబ్జి వివరించారు.