ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆదిత్య సంచలనం
బాలాజీచెరువు(కాకినాడ): తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించి విజయ పతాకాన్ని ఎగురవేశారు. ఉద్యోగాల సాధనలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులదే పై చేయి అని మరోసారి రుజువు చేస్తూ అత్యధిక సంఖ్యలో ఎంపికై సత్తా చాటారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్. శేషారెడ్డి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో 163 మంది ఉద్యోగాలు సాధించడం వెనుక అపారమైన శ్రమ ఉందన్నారు. ఇన్ఫోసిస్ వంటి బహుళజాతి సంస్థలో ఒకేసారి పెద్ద సంఖ్యలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ విభాగం అధ్యాపకులను అభినందించారు. ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ ఎన్. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఇంటర్వ్యూలలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు.
ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి ఎన్.కష్ణదీపక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో సరికొత్త విధానాలను అమలుచేయడం, విద్యార్థులకు మరింత సమయాన్ని క్యాంపస్ ఇంటర్వ్యూల శిక్షణ కోసం వినియోగించడం తదితర అంశాలు ఉపయోగపడ్డాయన్నారు. నాయుడు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం నుంచే సాఫ్ట్‌స్కిల్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంశాల పట్ల ప్రత్యేక దష్టి సారించి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, ప్రత్యేక శిక్షణను అందించామన్నారు.
ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.2 లక్షల 20 వేలు వేతనంతోపాటు, ప్రముఖ విద్యాసంస్థలలో ఎం.ఎస్. చేసే అవకాశం కల్పిస్తారని డెరైక్టర్స్ ఎస్పీ గంగిరెడ్డి, శ్రీరాఘవరెడ్డి, ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల సమన్వయకర్త బీఈవీఎల్ నాయుడు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను ఇన్ఫోసిస్ క్యాంపస్ అనుసంధాన ప్రతినిధి డాక్టర్ కె.సుధీర్‌రెడ్డి, ప్రాజెక్టు నిర్వాహకులు నర్రా సురేష్, ఎంపిక ప్రతినినిధి సుందరం, ప్రోగ్రాం మేనేజర్ అనిల్, ప్రసాద్ నిర్వహించారు.