ఎంత పనిచేశావు.. బామ్మర్దీ!
అవినీతి వ్యతిరేక ఉద్యమంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సరికొత్త తలనొప్పి వచ్చింది. ఆయన సొంత బావమరిది సురేందర్ కుమార్ బన్సల్ అవినీతికి పాల్పడ్డారంటూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం ఈ విచారణ మొదలుపెట్టింది. కేజ్రీవాల్ బావమరిది బన్సల్ నకిలీ బిల్లులు, ఇన్వాయిస్లు సమర్పించి ప్రజాపనుల శాఖ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఈ ఫిర్యాదు చేశారు. దాంతో దానికి సంబంధించిన ఆధారాలతో రావాలని విచారణ అధికారులు ఆయనకు సూచించారు. డమ్మీ కంపెనీల పేర్లతో ఢిల్లీ మునిసిపాలిటీ పరిధిలో డ్రెయిన్ల నిర్మాణ కాంట్రాక్టును బన్సల్ చేజిక్కించుకున్నారు. కేజ్రీవాల్ సాయం చేయడం వల్లే ఆయన బావమరిదికి ఈ కాంట్రాక్టు వచ్చిందని ఆరోపిస్తున్నారు. సదరు స్వచ్ఛంద సంస్థ కోర్టుకు వెళ్లగా, ఆ పిటిషన్ మీద విచారణ జరపాలా వద్దా అనే విషయమై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం విచారణ ఇప్పటికే ప్రారంభించారు.