మొన్న గుర్మీత్; నేడు రాధేమాకు భారీ షాక్
- స్వయంప్రకటిత దైవస్వరూపిణిపై పంజాబ్ హైకోర్టు ఆగ్రహం
- ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం
- సురీందర్ అనే వ్యక్తికి రాధేమా మోహపు వల, బెదిరింపులు
- ఆడియో టేపుల సంచలనం.. నేడో రేపో అరెస్ట్?
సాక్షి, చండీగఢ్: వివాదాస్పద ఆథ్యాత్మిక గురువు, స్వయంప్రకటిత దైవస్వరూపిణి రాధేమా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవపర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా పంజాబ్-హరియాణా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యామూర్తులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఫగ్వాడా(పంజాబ్)కు చెందిన వీహెచ్‌పీ మాజీ నేత సురీందర్ మిట్టల్‌ను రాధేమా గడిచిన కొన్నేళ్లుగా టార్చర్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాధేమా.. మొదట ప్రేమ మాటలు, తర్వాత మోహపువల, చివరికి చంపేస్తాంటూ బెదిరింపులకు పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఫోన్ రికార్డింగ్స్‌ను కోర్టుకు అందించానని, అన్ని పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తులు చర్యలకు ఆదేశాలిచ్చారని బాధితుడు సురీందర్ చెప్పుకొచ్చారు. సత్సంగ్ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని, భక్తులతోపాటు తాను కూడా నగ్నంగా డ్యాన్స్ చేసేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఎలా మొదలైంది?: ఇప్పుడు ముంబైలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుని కళ్లుమిరుమిట్లు గొలిపే దుస్తులు, విలాసవంతమైన కార్లు, భవనాలు, విదేశీయాత్రల్లో మునిగితేలుతున్న రాధేమా.. ఒకప్పుడు సాధారణ భక్తురాలు. ఆమె అసలు పేరు సుఖ్వీందర్ కౌర్. స్వస్థలం పంజాబ్‌లోని గుర్దాస్పూర్ జిల్లా డోరంగాల. నేటికి 15 ఏళ్ల కిందట.. అంటే, ఆమె గురువు అవతారం ఎత్తిన ప్రారంభదినాల్లో ఫడ్వాడా(పంజాబ్)పట్టణంలో ఒక జాగరణ నిర్వహించారు. తనను తాను దుర్గామాత అవతారంగా చెప్పుకుంటున్న ఆమెను.. స్థానిక విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సురీందర్ మిట్టల్ ఆధ్వర్యంలోని కార్యకర్తలు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మూగిన వీహెచ్‌పీ కార్యకర్తలు రాధేమా జాగరణ నిర్వహించిన భవంతిపై రాళ్లదాడి చేశారు. దీంతో బెంబేలెత్తిపోయిన రాధేమా అందరికీ క్షమాపణలు చెప్పుకుని అక్కడి నుంచి బయటపడ్డారు. - సాక్షి వెబ్-
వదల బొమ్మాళి..: ఆ సంఘటన తర్వాత ముంబై వచ్చేసిన రాధేమా క్రమంగా పాపులారిటీ సంపాదించారు. పదుల సంఖ్యతో ప్రారంభమైన ఆమె భక్తజనం నేడు లక్ష వరకూ చేరింది. మోడ్రన్ లుక్‌తో, ప్రేమపూర్వక వచనాలు వల్లించే రాధేమా.. తన భక్తుల కుటుంబ తగాదాలు పరిష్కరించడం మొదలు పెద్దపెద్ద సమస్యలను కూడా పరిష్కరించేయత్నం చేసేవారు. తన దారికి అడ్డొచ్చినవాళ్లను నయానో, భయానో లొంగదీసుకునేందుకూ ఆమె వెనుకడుగు వేయలేదు. నాటి నుంచే రాధేమా తీరును వ్యతిరేకిస్తోన్న సురీందర్ మిట్టల్.. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీంతో సురీందర్పై దృష్టిసారించిన ఆమె.. ప్రేమపేరుతో అతనికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రులు ఫోన్ చేసి..‘నీ ప్రేమలో పిచ్చిదాన్నైపోయా.. దూరంగా ఉండలేకపోతున్నా..’ అంటూ మాట్లాడేవారు. తాను అప్పటి మనిషిని కాదని, తలుచుకుంటే ఏదైనా చేయగలని బెదిరించేవారు. -సాక్షి వెబ్
నేడో, రేపో అరెస్ట్!: రాధేమాతో మాట్లాడిన ఫోన్ సంభాషణలు మొత్తం రికార్డు చేసిన సురీందర్.. వాటిని ఆధారాలుగా చూపుతూ ఆగస్టు 23న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు రావాలని పోలీసులు కోరగా.. రాధేమా వినిపించుకోలేదు. దీంతో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సురీందర్ పంజాబ్-హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు.. రాధేమాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మంగళవారం పంజాబ్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కేసు నమోదు చేయనున్న పోలీసులు.. నేడో, రేపో రాధేమాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.