సురేష్‌బాబుపై సీఐ జులుం
పెనమలూరు, న్యూస్‌లైన్ :పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పడమట సురేష్‌బాబుపై ఆదివారం ఏసీపీ షకీలాభాను ఎదుటే పెనమలూరు సీఐ ధర్మేంద్ర జలుం ప్రదర్శించారు. దీనికి సురేష్‌బాబు అభ్యంతరం చెప్పగా సీఐ వేలు చూపిస్తూ అంతుచూస్తానని హెచ్చరించారు. దీంతో సురేష్‌బాబు కూడా ఎదురు తిరగటంతో పోలీసులు జోరు తగ్గించారు. వివరాల్లోకి వెళితే.. పెనమలూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం గంగూరు వద్ద బందరు రోడ్డుపై పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు.
బందరు రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డు వేశారు. సమాచారం తెలుసుకున్న సీఐ ధర్మేంద్ర సీఆర్పీఫ్ సిబ్బందితో అక్కడకు వచ్చీ రావడంతోనే సురేష్‌బాబుపై విరుచుకుపడ్డారు. విజయవాడలో ఎక్కడా బంద్ జరగటం లేదని, ఇక్కడ అడ్డుకుంటారేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తామంతా రోడ్డుపై వంటావార్పు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా సహకరిస్తామని సురేష్‌బాబు చెప్పినా సీఐ అంగీకరించలేదు. అడ్డు తీసివేయాలని, లేకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని వేలుచూపిస్తూ హెచ్చరించారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో అడ్డు తొలగించే యత్నం చేశారు.
దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈలోగా తూర్పు డివిజన్ ఏసీపీ షకీలాభాను అక్కడకు వచ్చారు. సీఐ ఆమె ఎదురుగానే సురేష్‌బాబుతో వాగ్వాదానికి దిగుతూ రెచ్చిపోయారు. సీఐ ప్రవర్తనపై సురేష్‌బాబు అభ్యంతరం చెబుతూ ఏసీపీకి ఫిర్యాదు చేశారు.సీఐ ఇతర పార్టీలకు కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గతంలో ఉన్న సీఐ కూడా ఈ విధంగానే వ్యవహరించి బదిలీపై వెళ్లారని, వైఖరి మార్చుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరిం చారు. తాను పరిశీలిస్తానని, వివాదం వద్దని ఏసీపీ చెప్పడంతో కార్యకర్తలు శాంతించారు.
సైకిల్ కాంగ్రెస్‌కు సీఐ మద్దతు :
సురేష్‌బాబు
పెనమలూరు సీఐ ధర్మేంద్రకి సైకిల్ కాంగ్రెస్ నేతలంటే ఎనలేని భక్తని, వారు బందరురోడ్డుపై ఆందోళన చేస్తే వారి వెంటే ఉండి కార్యక్రమం నడిపించారని సురేష్‌బాబు ఆరోపించారు. పెనమలూరు, పోరంకి గ్రామ టీడీపీ నేతలు బందరు రోడ్డుపై వంటావార్పు చేస్తే సీఐ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సైకిల్ కాంగ్రెస్‌తో సీఐ మిలాఖత్ అయ్యి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చు విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీఐ వైఖరి మార్చుకోక పోతే పోలీస్‌స్టేషన్ ఎదుటే సమైక్యవాదులతో ధర్నా చేస్తానని హెచ్చరించారు.