డీఎస్సీ-2014లో అవకాశమివ్వాలని ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్ : డీఎస్సీ-2014లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డీఎడ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. అంతకుముందు నగరంలో వారు ర్యాలీ నిర్వహించారు. బైఠాయింపులో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్ర, గంగా సురేష్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడకముందే టెట్ నిర్వహించాలని, లేదంటే టెట్‌ను రద్దు చేసి డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా ఈ సంవత్సరం కౌన్సెలింగ్ ఆరు నెలలు ఆలస్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. తమకు తరగతుల నిర్వహణ కూడా ఆలస్యమైందన్నారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వం డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని కోరా రు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చు కు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఏఐఎస్ఎఫ్ అధ్య క్ష, కార్యదర్శులతోపాటు ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్స్టేషన్కుకు తరలించారు.
తమ కోర్కెలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను విడుదల చేశారు. ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దిలేటి, జగన్ నాయక్, సునీల్, ఖాదర్‌వలీ, శ్యాం, నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.