రైనా కొట్టిన సిక్సర్ తగిలి..
చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. ఇప్పటికే టెస్ట్, వన్డే సిరీస్‌లు రెండూ గెలిచినా, టి20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్పోవడంతో సిరీస్ విజయం కావాలంటే చివరి మ్యాచ్ కూడా తప్పనిసరిగా గెలిచి తీరాల్సిందే. ఇలాంటి టి20లో టీమిండియా బ్యాట్స్‌మన్ సురేష్ రైనా రెచ్చిపోయాడు. 45 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ 140. జట్టులో టాప్ స్కోరర్ కూడా రైనాయే. అటు ఫీల్డింగ్‌లో కూడా అద్భుతమైన క్యాచ్ పట్టి అది మరెవరికీ సాధ్యం కాదని నిరూపించాడు.
అయితే, రైనా కొట్టిన ఐదు సిక్సర్లలో ఒక సారి మాత్రం బంతి ఒక కుర్రాడికి తగిలింది. చాలాసార్లు బ్యాట్స్‌మన్ కొట్టిన సిక్సర్లు ప్రేక్షకుల్లోకి వెళ్లడం, వాళ్లు వాటిని క్యాచ్ పట్టి సంబరం చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఆరేళ్ల కుర్రాడికి ఆ బాల్ తగిలింది. అది కూడా సరిగ్గా తొడమీద పడింది. దాంతో అతడికి తొడమీద కొద్దిపాటి గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతున్న ఆ పిల్లాడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స అందించి అనంతరం డిశ్చార్జి చేశారు.