surrender court
-
Donald Trump: కోర్టులో లొంగిపోనున్న ట్రంప్!
న్యూయార్క్: శృంగార తార(మాజీ)తో సంబంధం బయటపడకుండా ఉండేందుకు ఆమెకు డబ్బు చెల్లించి అనైతిక ఒప్పదం చేసుకున్న కేసులో.. డొనాల్డ్ ట్రంప్‌పై దాదాపు నేరారోపణలు రుజువయ్యాయి. అయితే ఆయన అరెస్ట్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చేకంటే ముందే.. ఆయన స్వచ్ఛందంగా కోర్టులో లొంగిపోవాలని, ఆరోపణలపై విచారణకూ హాజరు కావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ట్రంప్ తరపున లాయర్(అటార్నీ) జోయ్ టాకోపినా ఒక ప్రకటన చేశారు. ట్రంప్ వచ్చేవారం మాన్‌హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోయే అవకాశం ఉందని జోయ్ ప్రకటించారు. మరోవైపు ట్రంప్ లీగల్ టీం కూడా ప్రాసిక్యూటర్లతో టచ్‌లో ఉందని, వచ్చేవారం విచారణకు ఆయన వాళ్ల ఎదుట హాజరు కావొచ్చని పేర్కొంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. సె* స్కాండల్ కేసులో దోషిగా తేలినప్పటికీ.. 2024 అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్ వేసిన బిడ్‌పై అనర్హత వేటు పడదు. ఎందుకంటే గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికలకు ట్రంప్ తన అభ్యర్థిత్వ పత్రాలను దాఖలు చేశారు కాబట్టి. కాకపోతే నైతిక విజయంపై ఇది ప్రభావం చూపెట్టవచ్చని, ఆయన కెరీర్లో ఓ మచ్చగా మిగిలిపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. hush money case ప్రకారం.. ట్రంప్ తనతో ఉన్న లైంగిక సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు.. స్టార్మీ డేనియల్స్ అలియాస్ స్టెఫానీ క్లిఫార్డ్ అనే పో* స్టార్‌తో ఒప్పందం చేసుకున్నాడు. అందుకుగానూ తన వ్యక్తగత లాయర్ ద్వారా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ముట్టజెప్పాడు ట్రంప్. ఇది 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు జరిగింది. అయితే.. రెండేళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్డిస్క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ఏంజెల్స్ కోర్టులో దావా వేసిందామె. ఆ సమయంలో ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉండడంతో దీన్నొక హైప్రొఫైల్ కేసుగా భావించి.. అత్యున్నత దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ కేసులోనే ఆరోపణలు రుజువు కావడంతో.. ఆయనపై ఇప్పుడు నేరారోపణలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2006లో రియల్ ఎస్టేట్ టైకూన్‌గా పేరొందిన డొనాల్డ్ ట్రంప్.. స్టార్మీ డేనియల్స్‌ను తొలిసారిగా ఓ గోల్ఫ్ టోర్నమెంట్ సందర్భలో కలుసుకున్నారు. ఆ సమయానికి ఆమె వయసు 27. ట్రంప్ వయసు 60. 2018లో ఫుల్ డిస్క్లోజర్ అనే పుస్తకం ద్వారా ట్రంప్‌తో తనకు జరిగిన పరిచయం, ఆపై విషయాలను ప్రచురించింది స్టార్మీ డేనియల్స్. ఆ ఈవెంట్లో ట్రంప్ బాడీగార్డుల్లో ఒకతని ద్వారా నాకు ఆహ్వానం అందింది. ఆయన(ట్రంప్), నేను రాత్రి భోజనం తర్వాత ఆయనకు సంబధించిన ఓ పెంట్‌హౌజ్‌కు చేరుకున్నాం. అక్కడే తామిద్దరం శారీరకంగా కలుసుకున్నాం. అప్పటికీ ఆయన మూడో భార్య.. పిల్లలను కని నెలలు అవుతుందేమో. నాతో కలయికను ట్రంప్ ఎంతగానో పొగిడారని ఆ బుక్‌లో ఆమె పేర్కొంది. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో.. తనకు ఇచ్చిన మాట తప్పడంతో ఈ శృంగార తార సంబంధం బయటపెట్టేందుకు సిద్ధమైంది. అయితే తన లాయర్ ద్వారా ఆమెతో ఒప్పంద చేసుకుని.. డబ్బు ద్వారా ఆమె నోరు మూయించే యత్నం చేశాడు ట్రంప్. 2018 ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారామె. మరోవైపు ట్రంప్ ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. దీనిని ఎలా ఎదుర్కొన్నాలో తనకు తెలుసని సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు. -
యువరాజ్ లొంగుబాటు
సాక్షి, చెన్నై : ఇంజినీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు యువరాజ్ సీబీసీఐడీ ఎదుట ఆదివారం లొంగి పోయాడు. యువరాజ్ లొంగిపోతున్న సమాచారంతో పెద్ద సంఖ్యలో మా వీరన్ ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై వర్గాలు సీబీసీఐడీ కార్యాలయం వద్దకు తరలివచ్చాయి. వారిని కట్టడి చేసే క్రమంలో ఉద్రిక్తత, ఉత్కంఠ నెలకొంది. నామక్కల్ జిల్లా తిరుచంగోడులో హత్యకు గురైన ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్ రాజ్ కేసులో మా వీరన్ ధీరన్ చిన్నమలై గౌండర్ పేరవై నేత యువరాజ్‌ను ప్రధాని నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈకేసులో ఇప్పటికే పలువురు అరెస్టయి, బెయిల్ మీద బయటకు వచ్చి ఉన్నారు. అయితే, యువరాజ్ మాత్రం పోలీసుల చేతికి చిక్కకుండా చుక్కలు చూపించే పనిలో పడ్డారు. ఈ కేసు విచారణ సమయంలో నామక్కల్ డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లు ఉన్నాయని అజ్ఞాతంలో ఉంటూ యువరాజ్ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూ వచ్చాడు. తమకు ఓ సవాల్‌గా మారిన యువరాజ్‌ను అరెస్టు చేయడానికి సీబీసీఐడీ వర్గాలు తీవ్రంగా కుస్తీల పట్టాయి. ఎట్టకేలకు విచారణకు తాను సహకరిస్తానని లొంగి పోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు యువరాజ్ ప్రకటించాడు. లొంగుబాటు : సీబీసీఐడీ ఎదుట లొంగి పోయేందుకు తమ నేత నిర్ణయించడంతో ఆ పేరవై వర్గాలు ఆదివారం ఉదయాన్నే నామక్కల్‌లోని ఆ కార్యాలయం వద్దకు తరలి వచ్చాయి. దీంతో ఆపరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున బలగాల్ని రంగంలోకి దించి భద్రతను పర్యవేక్షించారు. అదే సమయంలో నామక్కల్ పరిసరాల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల కళ్లు గప్పి యువరాజ్ చాకచక్యంగా వ్యవహరించి సీబీసీఐడీ కార్యాలయం వద్దకు పదకొండు గంటల సమయంలో చేరుకున్నాడు. ఓ మోటారు సైకిల్‌పై తనను ఎవరూ గుర్తు పట్టని విధంగా హెల్మెట్ ధరించి ఆ కార్యాలయం వద్దకు యువరాజ్ దూసుకొచ్చాడు. మూడు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న తమ నాయకుడు బయటకు రావడంతో ఆ పేరవై వర్గాలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఆ కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నాయి. చివరకు పోలీసులు ఆ పేరవై వర్గాలను పక్కకు పంపించి యువరాజ్‌ను లోనికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నతాధికారుల సమక్షంలో లొంగిపోయాడు. దీంతో యువరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముందుగా మీడియాతో మాట్లాడుతూ, ఇది తప్పుడు కేసు అన్న విషయం అందరికీ తెలుసునని, తాననిర్దోషిగా బయటకు వస్తానన్నారు. అయితే, డీఎస్పీ విష్ణుప్రియ ఆత్మహత్య వెనుక ఉన్న అధికారులు శిక్షించ బడాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్లందరిపై చర్యలు తీసుకునే విధంగా తాను కోర్టులో స్పందిస్తానని వ్యాఖ్యానించారు.