Survey General of India
-
ఆ గట్టా.. ఈ గట్టా..!
సాక్షి, అమరావతి: ఆంధ్రా–కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. నాది ఆ గట్టు అంటే.. కాదు నాది ఈ గట్టు అంటూ రెండు రాష్ట్రాలు దశాబ్దాలుగా వాదులాడుకుంటూనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా రెండు రాష్ట్రాలు అటవీ సరిహద్దు (గట్టు)ను తేల్చు కోలేకపోతున్నాయి. దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా (ఎస్జీఐ) ఇరు రాష్ట్రాలతో చర్చలు సాగించినా సరిహద్దు సమస్య తేలలేదు సరికదా దీని నిర్ధారణకు దేనిని ప్రామాణికంగా తీసుకోవాలో కూడా అంతుపట్టడం లేదు. దీనిని తేల్చడం కోసం హైదరాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్‌లో పలుమార్లు ఇరు రాష్ట్రాల అటవీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. 1916 అటవీ సరిహద్దును ప్రామాణికంగా తీసుకుని సర్వే చేయాలని ఆంధప్రదేశ్.. తమ గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ (జీసీపీ)ని ప్రామాణికంగా తీసుకోవాలని కర్ణాటక పట్టుబడుతూ వచ్చాయి. వీటిని ఆధారంగా (బేస్‌లైన్)గా తీసుకుంటే సరిహద్దు నిర్ధారణ అసాధ్యమని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం (జూలై 23న) రెండు రాష్ట్రాల ప్రతినిధులతో డెహ్రాడూన్‌లో జరిగిన సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో ఈ వివాదానికి ఎలాగైనా ముగింపు పలకాలని ఎస్జీఐ భావిస్తోంది. వివాదం ఎప్పటిది? ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో బళ్లారి ప్రాంతం ఉండేది. ఉమ్మడి మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు 1953లో బళ్లారి ప్రాంతం కర్ణాటకలో (అప్పుడు మైసూర్)లో కలిసింది. దీంతో బళ్లారి రిజర్వు ఫారెస్టును ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల మధ్య విభ జించాల్సి వచ్చింది. 1896 నాటి బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ప్రామాణికంగా తీసుకుని కర్ణాటక–ఆంధప్రదేశ్ మధ్య అభయారణ్యంలో సరిహద్దును ఖరారు చేసుకుందామని అప్పట్లో మౌఖికంగా అంగీకరిం చారు. ఇలాగైతే శాస్త్రీయంగా ఉంటుందని ఎస్జీఐ నిర్ణయానికి వచ్చి అభిప్రాయాలు తెలియజేయాలని ఇరు రాష్ట్రాలకు ఎస్జీఐ లేఖలు రాసింది. మొన్నటి వరకూ జీసీపీని ప్రామాణికంగా తీసుకోవాలని వాదిస్తూ వచ్చిన కర్ణాటక.. 1896 నాటి బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ప్రామాణికంగా తీసుకోవడానికి తమకు అభ్యంతరం లేదంటూ ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంది. మైనింగ్ సంస్థల వివాదంతో.. అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం, సిద్ధాపురం, మలపనగుడి, డిహరేహల్ గ్రామాల పరిధిలోని అటవీ భూముల్లో మైనింగ్ లీజులు తీసుకున్న సంస్థలు కర్ణాటక రాష్ట్రంలోని అటవీ భూమిలో కూడా తవ్వకాలు సాగించాయనే అంశం వివాదాస్పదంగా మారింది. దీంతో ఇది సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. రెండు రాష్ట్రాల సహకారంతో సర్వేచేసి 12 వారాల్లోగా సరిహద్దును ఖరారు చేయాలని ఎస్‌జీఐని ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన ఉమ్మ డి సర్వేలో ఏపీ పరిధిలోని 600 ఎకరాల వరకూ కర్ణాటక ఆక్రమించిందని తేలింది. దీనిని కర్ణాటక అంగీకరించలేదు. సరిహద్దు నిర్ధారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మరో నెలలో ముగుస్తుండడంతో ఎలాగైనా ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని ఎస్జీఐ నిర్ణయించింది. 2 రాష్ట్రాలను ఒప్పించేందుకు ఈనెల 23న డెహ్రాడూన్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. దీనిపై రాష్ట్ర అటవీ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారిని ‘సాక్షి’ సంప్రదించగా.. ‘1916 అటవీ సరిహద్దును ప్రామాణికంగా తీసుకోవాలని గతంలో డిమాండు చేస్తూ వచ్చాం. 1896 బళ్లారి రిజర్వు ఫారెస్టు మ్యాపులను ఆధారంగా తీసుకోవాలన్న జీఎస్ఐ అభిప్రాయానికి సమ్మతి తెలపాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అభిప్రాయాన్ని సోమవారం జరిగే సమావేశంలో తెలియజేయనున్నాం’ అని తెలిపారు. -
ప్రభుత్వ ఆధారిత మ్యాప్‌ల వెబ్సైట్ ప్రారంభం
న్యూఢిల్లీ: సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్జీఐ) రూపొందించిన సుమారు 3000 మ్యాప్‌లను భారత ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అయితే ఈ http://soinakshe.uk.gov.in వెబ్సైట్ నుంచి మ్యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒక వ్యక్తి తన ఆధార్ నంబర్‌ను ఉపయోగించి రోజుకు 3 మ్యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. ఈ మ్యాప్‌లను భారతీయులకు మాత్రమే అందుబాటులోఉంచాలన్న ఉద్దేశంతోనే ఆధార్ నంబర్ తప్పనిసరి చేశామని తెలిపారు. ఎస్జీఐ ఆవిర్భవించి సోమవారంతో 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశానికి సంబంధించిన మ్యాప్‌లను అధికారికంగా ఎస్జీఐ మాత్రమే తయారు చేస్తుంది. -
సర్వే జనరల్ ఆఫ్ ఇండియా@ 250
న్యూఢిల్లీ : దేశంలో పౌర, సైనిక అవసరాలకు మ్యాపుల్ని రూపొందించే సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్జీఐ) నేటితో 250 ఏళ్లు పూర్తిచేసుకుంది. దేశ, రాష్ట్రాల సరిహద్దులు, నదులు, డ్యాములు, రోడ్లు, వరద ప్రభావిత మైదాన ప్రాంతాలు, వివిధ స్థలాకృతులతో పాటు పట్టణ, నగర ప్రణాళిక మ్యాపుల్ని రూపొందించడం ఎస్జీఐ విధుల్లో ప్రధానమైనవి. 1767లో సర్వే జనరల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఎస్జీఐ తొలిసారి 1783లో అవిభక్త భారత్ పటాన్ని ‘మ్యాప్ ఆఫ్ హిందుస్తాన్’గా విడుదల చేసింది. అందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, మయన్మార్‌లోని కొన్ని భూభాగాలున్నాయి. భారత్‌లోని భూభాగాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి 1802లో ఎస్జీఐ ‘ట్రిగొనమెట్రిక్ సర్వే’ను జరిపింది. మద్రాసు రాష్ట్రంలోని సెయింట్ థామస్ పర్వతం నుంచి ముస్సోరీ వరకూ 40 ఏళ్లS పాటు ఈ సర్వే సాగింది. ఈ సర్వే గురించి ఎస్జీఐ అధికారి లెఫ్టినెంట్ కల్నర్ కునాల్ బోర్కర్ మాట్లాడుతూ ‘రెండు ప్రపంచ యుద్ధాల కంటే ఈ సర్వేలోనే ఎక్కువమంది భారతీయులు చనిపోయారు. మలేరియా, వడదెబ్బ, కొండ చరియలు విరిగిపడడం వంటి కారణాలతో చాలామంది మృత్యువాతపడ్డారు’ అని తెలిపారు. ఈ సర్వేకు నేతృత్వం వహించిన కల్నల్ విలియం లాంబ్టన్ చనిపోవడంతో సర్ జార్జ్ ఎవరెస్ట్ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఈయన పేరు మీదే ఎవరెస్ట్ పర్వతానికి ఆపేరు పెట్టారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎవరెస్ట్ పర్వతం ఎత్తును భారతీయ గణితశాస్త్రవేత్త రాధనాథ్ సిక్డర్ లెక్కల సాయంతోనే ఎస్జీఐ నిర్థారించింది. దీన్ని అప్పట్లో చాలామంది యూరోపియన్లు సవాలు చేశారు. కానీ రాధనాథ్ అంచనాలే చివరికి నిజమయ్యాయి. ప్రస్తుతం ఎస్జీఐ సైన్యం కోసం జియో స్పేషియల్ (భౌగోళిక) మ్యాపుల్ని తయారుచేస్తోంది. వీటి కోసం మానవ రహిత విమానాలను ఉపయోగిస్తోంది.