ఇరోమ్ షర్మిల దీక్ష రహస్యం ఇదే!
ఇంఫాల్ః మణిపూర్ ఉక్కుమహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల ఆరోగ్యం వెనుక రహస్యం యోగానట. 16 ఏళ్ళ పాటు నిరాహార దీక్షను చేసిన ఆమె.. నేటికీ ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఆమె ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయడమేనని తెలుస్తోంది. ఆమె నిరాహార దీక్షకు కూర్చునే రెండేళ్ళకు ముందు 1998లో ఆమె యోగా విద్యను అభ్యసించినట్లు ఆమె సహచరులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆహారం లేకపోయినా షర్మిల శారీరక ఆరోగ్యం, మానసిక శక్తి కలిగి ఉండటానికి యోగ సాధనే ప్రధాన కారణమని ఆమె సోదరుడు ఇరోమ్ సింఘజిత్ తెలిపారు.
సహజ శ్రేయస్సును, ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రకృతి వైద్యానికి షర్మిల తొంభైల్లోనే ఆకర్షితురాలైంది. అందులో భాగంగానే యోగ విద్యను కూడా అభ్యసించింది. యోగా ఫుట్బాల్ వంటిది కాదని, శారీరక వ్యాయామంతోపాటు, మానసిక శక్తిని ఇచ్చే యోగా పూర్తిగా భిన్నమైనదని, మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతికేందుకు దోహద పడుతుందని షర్మిల చెప్తారు. యోగా క్రమం తప్పకుండా చేసినవారు వందేళ్ళ వరకూ ఆరోగ్యంగా జీవిస్తారని, యోగా ఇతర వ్యాయామాలు, ఫుట్బాల్ వంటి క్రీడల్లాంటిది కాదని, షర్మిల జీవితచరిత్ర 'బర్నింగ్ బ్రైట్' లో రచయిత దీప్తిప్రియా మెర్హోత్రా తెలిపారు.
1998-99 సమయంలో షర్మిల యోగాసనాలు వేయడం మొదలు పెట్టినదగ్గరనుంచీ ఇప్పటి వరకూ ప్రతిరోజూ చేస్తూనే ఉన్నారని దీప్తిప్రియా గుర్తు చేశారు. షర్మిల మిగిలిన వ్యక్తుల్లా కాదని, యోగా, వాకింగ్ తో ఆమె శరీరంపై నిరంతర ప్రయోగాలు చేస్తుంటారని బయోగ్రఫీ పుస్తకంలోని విరాలను బట్టి తెలుస్తుంది. జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో, పోలీసుల నిర్బంధంలో 16 సంవత్సరాలపాటు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగించిన షర్మిలకు, ముక్కునుంచి ట్యూబ్ ద్వారా కడుపులోకి ద్రవరూపంలో ఆహారాన్ని బలవంతంగా పంపించారు. సైనిక బలగాల ప్రత్యేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష కొనసాగించిన ఆమెపై పలుమార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. అండర్ ట్రయల్ ఖైదీగా ఉంటూ దీక్షను కొనసాగించిన ఆమె.. జైల్లో అధికభాగం ఒంటరి జీవితాన్నే గడిపారు.