సినీ ఇండస్ట్రీపై హీరో ఆసక్తికర కామెంట్స్
న్యూఢిల్లీ: సినిమా రంగంలో రాణించాలంటే నటించడం వస్తే సరిపోదని అంటున్నారు విలక్షణ నటుడు సోనూసూద్. అందునా బాలీవుడ్లో పేరు తెచ్చుకోవడం మామూలు విషయమేమీ కాదని, అక్కడ మిగతా వాళ్లకంటే భిన్నంగా, రోజుకో విధంగా మనదైన ప్రత్యేకత చాటుకుంటేతప్ప నిలబడలేమని వ్యాఖ్యానించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్.. ఇలా ప్రాంతీయ, భాషాబేధాలకు అతీతంగా సినిమాలు చేస్తోన్న ఆయన.. జాకీచాన్‌తో కలిసి 'కుంగ్‌ఫూ యోగా' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 28న చైనాలో, ఫిబ్రవరి 3న ఇండియాలో విడుదలకానున్న నేపథ్యంలో సోనూ బుధవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
మోడలింగ్ నుంచి బాలీవుడ్‌లోకి నటుడిగా అడుపెట్టిన రోజుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, అయితే ప్రతి సందర్భంలోనూ తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో గట్టెక్కగలిగానని సోనూసూద్ చెప్పారు. రంగప్రవేశం చేసిన చాలా రోజులకుగానీ 'బ్రేక్‌త్రూ' వచ్చిందని గుర్తుచేసుకున్నారు. గత ఏడాది ఆస్కార్ అవార్డులకుగానూ చైనా తరఫున ఎంపికైన ఏకైక చిత్రం 'జువాన్జాంగ్' సినిమాలనూ సోనూ ఓ ముఖ్యపాత్ర పోషించారు. వచ్చే నెలలో విడుదలయ్యే 'కుంగ్‌ఫూ యోగా'కూడా రెండు దేశాల్లో హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమన్నా, ప్రభుదేవా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన 'తూతక్ తూతక్ తూతియా'(తెలుగులో 'అభినేత్రి') సినిమాతో సోనూ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే.