surviving
-
వెరైటీ 'అవ్వ'.. 30 ఏళ్లుగా చాయ్‌తోనే
చండూరు: ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం.. రాత్రి భోజనం.. మూడు పూటలా తింటున్నా.. మధ్యలో స్నాక్స్ అని.. ఏవేవో లాగించే రోజులివి. కానీ ఓ వృద్ధురాలు 30 ఏళ్లుగా భోజనం చేయకుండా కేవలం చాయ్ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ (60)కు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందారు. సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స జరిగిన కొన్నిరోజుల తర్వాత అన్నం తింటే జీర్ణం కాక వాంతులయ్యాయి. దాంతో ఇక అన్నంపై విరక్తి పెంచుకున్న ఆమె.. కేవలం చాయ్ తాగడం మొదలు పెట్టింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకుంది. ఇప్పటికీ సుగుణమ్మ రోజూ ఒకేసారి చాయ్ చేసుకోవడం.. ప్లాస్క్‌లో నింపుతుంది. ఆకలేసినప్పుడల్లా చాయ్ తాగుతూ క్షుద్బాధ తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు చాయ్‌లో మరమరాలు వేసుకుంటుంది. సుగుణమ్మ కూతురికి పెళ్లికాగా, కుమారుడు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. -
పద్దెనిమిదేళ్లుగా అన్నం తినకుండా..
రాయ్‌పూర్: ఒక్కపూట భోజనం లేకుంటేనే కడుపులో పేగులు మెలిపెడతాయి.. అలాంటిది ఏకంగా పద్దెనిమిదేళ్లపాటు పంటికి ఆహారం అంటే ఏమిటో తెలియకుంటే బతకడం సాధ్యమేనా.. ఈ విషయం మాత్రం సాధ్యమేనేమో అని చెప్తోంది. చత్తీసగఢ్ లోని కొరియా జిల్లాలో పీలీ బాయి(48) అనే మహిళ ఉంది. ఆమె కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగుతూ బతికేస్తుంది. 1995లో పెళ్లి చేసుకున్న ఆమె కేవలం ఒక్క రోజుమాత్రమే కాపురం చేసింది. బక్కపలచటి దేహంతో ఆశ్చర్యపోయేలా ఉన్న ఆమెను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారు చేసిన పరీక్షల్లో ఆమె అసలు ఆహారమే ముట్టలేదని తెలిసింది. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఇది నిజంగా వైద్యశాస్త్రం ప్రకారం ఓ అద్భుతం అని వర్ణించారు. 'పీలీకి బిడియం ఎక్కువ. మాతోనే (పీలీ తల్లిదండ్రులు) బారదీయ గ్రామంలో ఉంటోంది. 18 ఏళ్లుగా తను ఎలాంటి ఆహారం ముట్టుకోకుండా రోజుకు రెండు మూడు కప్పుల బ్లాక్ టీ తాగి బతికేస్తోంది' అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెను ఇప్పటికే ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పినట్లు వెల్లడించారు. అయితే, వైద్యులు మాత్రం ఆమె శారీరకంగా బలంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే, ఒక వ్యక్తి బ్లాక్ టీపై ఆధారపడి జీవించడం చాలా అరుదు అని, అని అసలు సాధ్యం కాదని కూడా వారు చెప్పారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రి వైద్యులు ఆమెను బ్లాక్ టీ ఉమెన్ అని పిలుస్తున్నారట. ఎలాంటి ఆహారం తీసుకోకుండానే పీలీ బాయి ప్రస్తుతం 45 కేజీల బరువు ఉంది. ఆమె భర్త అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు. -
పన్నెండేళ్ల పిండం.. ఆరోగ్యకరమైన బిడ్డ
చైనాలో అత్యంత అరుదైన శిశువు జన్మించి ప్రపంచ ఖ్యాతి గాంచింది. 12 ఏళ్ల పాటు ఆస్పత్రిలో భద్రపరచిన పిండం.. దేశంలో లాంగెస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీగానే కాక అత్యంత ఆరోగ్యకరమైన బిడ్డగా పేరు తెచ్చుకుంది. చైనా వాయవ్య షాంగ్జీ రాష్ట్రంలోని 40 ఏళ్ల మహిళ లీ గేవ్ తన రెండో కొడుకుగా 3.440 కిలోగ్రాముల బిడ్డకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. గ్జియాన్ నగరంలోని తంగ్డు ఆస్పత్రిలో బుధవారం లీ తన బిడ్డకు జన్మనిచ్చింది. మహిళల్లో సంతానోత్పత్తి, గర్భధారణపై ప్రభావం చూపే ఫెలోపియన్ నాళాలు మూసుకుపోవడం, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న లీ గేవ్.. 2003 లో ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పట్లో డాక్టర్లు ఆమె నుంచి సేకరించిన 12 అండాలను.. ఆమె భర్త వీర్యకణాలతో కలపి పిండాలుగా రూపొందించారు. వాటిలోని రెండు పిండాలను లీ గర్భంలో ప్రవేశపెట్టారు. మిగిలిన వాటిలో ఆరోగ్యంగా ఉన్న ఏడింటిని అలాగే ఆస్పత్రిలోని రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్లో భద్రపరిచారు. అనంతరం 2004 లో లీ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అప్పట్నుంచీ అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఆ పిండాలను భద్రపరిచడానికి ఆస్పత్రికి రోజుకు 50 సెంట్లు అంటే సుమారు 45 రూపాయల చొప్పున చెల్లిస్తూ వస్తోంది. గతేడాది చైనా ఒకే బిడ్డ విధానాన్ని ఎత్తివేయడంతో లీ.. రెండో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. దీంతో భద్రపరిచిన పిండాల నుంచి రెండు ఆరోగ్యమైన పిండాలను డాక్టర్లు ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టారు. వాటిలో ఒకటి విజయవంతమైంది. సాధారణంగా తమ ఆస్పత్రిలో ఈ పద్ధతిని అవలంబించే సమయంలో గర్భంలోకి రెండు మూడు పిండాలను ప్రవేశపెడతారని, ఎందుకంటే వాటిలో 40 శాతమే సురక్షితంగా ఉండే అవకాశం ఉందని తంగ్డు ఆస్పత్రి రీ ప్రొడక్టివ్ మెడిసిన్ సెంటర్ డైరెక్టర్ వాంగ్ గ్జియో హాంగ్ తెలిపారు. పిండాలను భద్రపరచడంతో అదృష్టం కొద్దీ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం కలిగిందని లీ గేవ్ భర్త ఆనందంగా చెబుతున్నాడు. మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ బ్రౌన్ 1978 లో బ్రిటన్‌లో జన్మించాడు. ఆ తర్వాత సుమారు 50 లక్షల మంది పిల్లలు ఐవీఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా జన్మించారు. చైనా ప్రధాన భూభాగంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ జెంగ్ మెంగ్జు 1988 లో జన్మించాడు. చైనాలో సుమారు 40 శాతం మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారని, ప్రభావవంతమైన పునరుత్పత్తి సహాయ పద్ధతుల్లో ఐవీఎఫ్ ఒకటి అని వాంగ్ తెలిపారు. 2003 నుంచీ తంగ్డూ ఆస్పత్రి పిండాలను భద్రపరచడం ప్రారంభించిందని ఇప్పటివరకూ సుమారు లక్షకు పైగా పిండాలను భద్రపరచగా, వాటిలో 27000 వరకూ పునరుత్పత్తికి వినియోగించామని... ఈ పద్ధతి ద్వారా 4,293 ఆరోగ్యకరమైన టెస్ట్ ట్యూబ్ బేబీలు జన్మించినట్లు వాంగ్ తెలిపారు.