పద్దెనిమిదేళ్లుగా అన్నం తినకుండా..
రాయ్పూర్: ఒక్కపూట భోజనం లేకుంటేనే కడుపులో పేగులు మెలిపెడతాయి.. అలాంటిది ఏకంగా పద్దెనిమిదేళ్లపాటు పంటికి ఆహారం అంటే ఏమిటో తెలియకుంటే బతకడం సాధ్యమేనా.. ఈ విషయం మాత్రం సాధ్యమేనేమో అని చెప్తోంది. చత్తీసగఢ్ లోని కొరియా జిల్లాలో పీలీ బాయి(48) అనే మహిళ ఉంది. ఆమె కేవలం బ్లాక్ టీ మాత్రమే తాగుతూ బతికేస్తుంది. 1995లో పెళ్లి చేసుకున్న ఆమె కేవలం ఒక్క రోజుమాత్రమే కాపురం చేసింది. బక్కపలచటి దేహంతో ఆశ్చర్యపోయేలా ఉన్న ఆమెను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారు చేసిన పరీక్షల్లో ఆమె అసలు ఆహారమే ముట్టలేదని తెలిసింది.
దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఇది నిజంగా వైద్యశాస్త్రం ప్రకారం ఓ అద్భుతం అని వర్ణించారు. 'పీలీకి బిడియం ఎక్కువ. మాతోనే (పీలీ తల్లిదండ్రులు) బారదీయ గ్రామంలో ఉంటోంది. 18 ఏళ్లుగా తను ఎలాంటి ఆహారం ముట్టుకోకుండా రోజుకు రెండు మూడు కప్పుల బ్లాక్ టీ తాగి బతికేస్తోంది' అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమెను ఇప్పటికే ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పినట్లు వెల్లడించారు.
అయితే, వైద్యులు మాత్రం ఆమె శారీరకంగా బలంగానే ఉన్నట్లు చెప్పారు. అయితే, ఒక వ్యక్తి బ్లాక్ టీపై ఆధారపడి జీవించడం చాలా అరుదు అని, అని అసలు సాధ్యం కాదని కూడా వారు చెప్పారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రి వైద్యులు ఆమెను బ్లాక్ టీ ఉమెన్ అని పిలుస్తున్నారట. ఎలాంటి ఆహారం తీసుకోకుండానే పీలీ బాయి ప్రస్తుతం 45 కేజీల బరువు ఉంది. ఆమె భర్త అప్పుడప్పుడు వచ్చి వెళుతుంటాడు.