స్టడీ కామ్ ప్రసాద్ కన్నుమూత
ప్రముఖ సినిమాటోగ్రాఫర్కుంపట్ల సూర్యదుర్గ వరప్రసాద్ (54) ఆదివారం ఉదయం కన్నుమూశారు. స్టడీకామ్ ప్రసాద్‌గా ఆయన సుపరిచితులు. గత కొన్ని రోజులుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన రాయవెల్లూరులోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట ప్రసాద్ స్వస్థలం. 12 ఏళ్ల వయసులోనే చెన్నయ్ వెళ్లి హరి అనుమోలు వద్ద కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించారాయన. దేశంలోనే పేరెన్నికగన్న స్టడీకామ్ ఆపరేటర్లలో ఒకరిగా ఎదిగారు.
మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ చిత్రాలకు స్టడీ కామ్ చేసి, నాగార్జున సూపర్‌హిట్ ‘నిన్నే పెళ్లాడతా’తో సినిమాటోగ్రాఫర్‌గా మారారు ప్రసాద్. రజనీకాంత్ ‘నరసింహ’ చిత్రానికి ప్రసాదే కెమెరామేన్. ఇంకా జూనియర్ ఎన్టీఆర్, అర్జున్, వేణు... ఇలా పలువురు హీరోలతో దాదాపు 25 సినిమాలకు పనిచేశారు. ఆయన ఛాయాగ్రహణం అందించిన ‘డేగ’ చిత్రం విడుదల కావల్సివుంది. ప్రసాద్‌కి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వెలిబుచ్చింది.
1
అమితాబ్, సారిక జోడీగా!
అమితాబ్ బచ్చన్, సారిక జంటగా నటిస్తున్నారా? బాలీవుడ్ వార్తల ప్రకారం ఔననే చెప్పాలి. అయితే, ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నది వెండితెర కోసం కాదు. బుల్లితెరపై ఈ జోడీ కనిపించనుంది. 30, 35 ఎపిసోడ్స్‌గా సాగే ఓ ధారావాహికలో ఈ ఇద్దరూ నటిస్తున్నారు. ఇందులో అమితాబ్‌కు ఇద్దరు భార్యలు ఉంటారట. మొదటి భార్యకు దూరమైనప్పటికీ, ఆ తర్వాత తమ కుమార్తె ద్వారా దగ్గరవుతారట అమితాబ్. ఆ మొదటి భార్య పాత్రను సారిక చేస్తున్నారు. ఈ ధారావాహికకు అమితాబ్ ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ధారావాహిక ప్రసారం కానుందని సమాచారం.