300 మీటర్లకే.. రూ.149 కోట్ల క్యాబ్ బిల్లు
న్యూఢిల్లీ: ముంబయికి చెందిన ఓ వ్యక్తికి క్యాబ్ సర్వీస్ సంస్థ ఓలా గుండె ఆగిపోయేటంత పనిచేసింది. ఈ నెల (ఏప్రిల్) 1ని అతడి జీవితంలో మరిచిపోలేని రోజుగా మార్చేసింది. దాదాపు ఒక పెద్ద ఏప్రిల్ ఫూల్‌గా మార్చేసింది. అతడు క్యాబ్ ఎక్కకమునుపే ఏకంగా రూ.149 కోట్లను చెల్లించాలంటూ సమాచారం పంపించింది. దీంతో బిత్తరపోయిన ఆ వ్యక్తి వెంటనే సంస్థతో సంప్రదింపులు జరిపి సాంకేతిక పరిజ్ఞానలోపం అని తెలుసుకున్నాక కుదుటపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సుశీల్ నర్సియాన్ అనే వ్యక్తి ఈ నెల (ఏప్రిల్) 1న ములుంద్ నుంచి వకోలా మార్కెట్‌కు వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు.
అయితే, అతడిని పికప్ చేసుకునేందుకు వచ్చిన డ్రైవర్ అడ్రెస్‌ను కనుక్కోలేకపోయాడు. ఎందుకంటే అతడి ఫోన్ ఆగిపోయింది. దాంతో నర్సియాన్ స్వయంగా క్యాబ్ వద్దకు నడుచుకుంటూ వెళ్లాడు. అయితే, ఒక 300 మీటర్లు ముందుకెళ్లాక డ్రైవర్ కారు ఆపేశాడు. తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో అతడు మరో క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా రూ.1,49,10,51,648 బిల్లు ఇప్పటికే చెల్లించాల్సి ఉందని, ఆ కారణంగా క్యాబ్ బుక్ చేసుకోలేరని సందేశం వచ్చింది.
అతడి ఓలా యాప్ వ్యాలెట్‌లో ఉన్న రూ.127ను కూడా డిడక్ట్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి వెంటనే సర్వీస్ సెంటర్‌కు ఫోన్ చేసి వివరాలు అడగగా అది టెక్నికల్ సమస్య అయ్యుంటుందని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తునే సోషల్ మీడియాలో చర్చ జరిగింది. రూ.149కోట్లా.. ఓలా అతడిని ఎక్కడి తీసుకెళ్లింది.. నెప్ట్యూన్పైకా, ఫ్లూటో మీదకా అంటూ జోకులు విసిరారు.