విపక్ష సభ్యుల సస్పెన్షన్
హైదరాబాద్: రాజధాని అమరావతిలో అధికార పార్టీ నేతల భూదందాపై సీబీఐ దర్యాప్తుకు డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సస్పెన్షన్ విధించారు. బుధవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు వైఎస్ఆర్సీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మినహా.. ఇతర పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారు. అయితే, సభకు రాని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై కూడా సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. ఈ రోజు సభకు రాని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా చర్య తీసుకున్నారు.
శాసనసభలో బుధవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు జగన్ మాట్లాడుతూ, రాజధాని అమరావతి పరిసరాల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అధికార రహస్యాలను కాపాడుతానని ప్రమాణం చేశారని, అయితే ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు అఫీషియల్ సీక్రెసీని ఉల్లంఘించారని, అందువల్ల మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ డిమాండ్ కు అంగీకరించని ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అధికార పార్టీకి చెందిన మంత్రులు, సభ్యులు ఒక్కొక్కరుగా ప్రతిపక్షంపై దూషణల పర్వం కొనసాగించింది. ఆ సందర్భంలోనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకుని గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ముగిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. దాంతో చర్చ ముగిసినట్టు స్పీకర్ ప్రకటన చేశారు.
దాంతో ప్రతిపక్ష సభ్యుడు పోడియం తమ నిరసన తెలియజేశారు. ఈ వ్యవహారంపై సీబీఐ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్ద నిరసనలు తెలియజేసారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ప్రతిపక్ష సభ్యులందరినీ ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండు చేయాలంటూ సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదించగా, స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండు చేశారు. ఆ సందర్భంగా సభలో లేని ప్రతిపక్ష సభ్యులను కూడా సస్పెండు చేయడం ఒకఎత్తయితే, ఇటీవలి కాలంలో టీడీపీలో చేర్పించుకున్న ఆదినారాయణ రెడ్డిని కూడా సస్పెండు చేయాలని మంత్రి ప్రతిపాదించడం విశేషం. ఆ తర్వాత పక్కనే ఉన్న సభ్యులు సమాచారం ఇవ్వడంతో నాలుక్కరుచుకున్న మంత్రి ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి పేరును తొలగించారు.
సస్పెండైన వారిలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు ఎస్పీ ఆజంద్ పాషా, అనిల్ కుమార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చందాపాషా, ఈశ్వరి, గౌతంరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఐజయ్య, జగ్గిరెడ్డి, జయరాం, కే జోగులు, వీ కళావతి, యూ కల్పన, ఎస్వీ మోహన్ రెడ్డి, షేక్ మహమ్మద్ ముస్తాపా, బీ ముత్యాల నాయుడు, జే నారాయణస్వామి, జ్యోతుల నెహ్రూ, ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి, పుష్పావాణి, కే రఘుపతి, ఎస్ రఘురామిరెడ్డి, పిడిత రాజన్న దొర, రాజేంద్రనాథ్, రాజేశ్వరి, రక్షణానిధి, రాంచంద్రరెడ్డి, రామకృష్ణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, వై సాయిప్రతాప్ రెడ్డి, కే సర్వేశ్వరరావు, కోరుమట్ల శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రావు, వీ సుబ్బారావు, సునీల్‌కుమార్, డీ తిప్పారెడ్డి, జై వెంకటరెడ్డి, సుజయ కృష్ణరంగారావు, వై విశ్వేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.