న్యాయవాదుల విధుల బహిష్కరణ
విశాఖ లీగల్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ న్యాయవాదులు శుక్రవారం విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు న్యాయవాదుల సంఘం గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానించారు. ఎన్నికల ముందు వివిధ రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు నీటిమూటలైన నేపథ్యంలో విధుల బహిష్కరణ చేపట్టనున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎన్.వి.సుమన్ తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కేంద్రం ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఇస్తామని చెప్పి నిలువునా ముంచేసిందన్నారు. కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటించే వరకూ తమ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్రంలోని న్యాయవాదులంతా విధులు బహిష్కరిస్తారని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సానుభూతి న్యాయవాదులు కూడా సంఘీభావం ప్రకటించారు.