suspension resolution suspended
-
నగరిలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు సంబరాలు
చిత్తూరు : ఎమ్మెల్యే రోజాపై ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గమంతటా నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి... మిఠాయిలు పంచుకున్నారు. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రజాసమస్యల మీద పోరాటం కొనసాగిస్తా: రోజా
ప్రజాసమస్యల మీద తన పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. ఈ విజయం తనది మాత్రమే కాదని, తన నియోజకవర్గ ప్రజలందరిదీనని ఆమె అన్నారు. తన హక్కుల గురించి ఆలోచించిన హైకోర్టు, తాను అసెంబ్లీకి వెళ్లేవిధంగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయస్థానాలు కలగజేసుకుని న్యాయం చేస్తాయన్న విషయం మరోసారి రుజువైందని, న్యాయ వ్యవస్థపై తన నమ్మకం రెట్టింపు అయిందని ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై విధించిన ఏడాది సస్పెన్షన్ తీర్మానాన్ని కొట్టేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆమె తమ న్యాయవాదులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇక ముందు కూడా తాను ప్రజల సమస్యల మీద గట్టిగానే ప్రభుత్వాన్ని నిలదీస్తానని రోజా చెప్పారు. తాను 1999లో రాజకీయాల్లోకి వచ్చానని, ఆరోజు నుంచి ఈరోజు వరకు పార్టీ ఏదైనా ప్రజాసమస్యల మీద పోరాడుతూనే ఉన్నానని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కూడా పోరాటం చేస్తానని చెప్పారు. తన పోరాటం ఎప్పుడూ అంశాల వారీగానే ఉంటుందని తెలిపారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన ఆర్డర్ కాపీ రాగానే అసెంబ్లీకి వెళ్తానని, జరిగిన అన్ని విషయాల మీద వివరణ ఇస్తానని ఆమె తెలిపారు. తాను తప్పు చేయనప్పుడు హాజరు కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజ్యాంగం ఉల్లంఘించినవారికి సమాధానం తనకు చాలా సంతోషంగా ఉందని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారికి తగిన సమాధానం చెప్పినట్లయిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ అన్నారు. అయితే కోర్టు ఇచ్చినవి మధ్యంతర ఉత్తర్వులు కాబట్టి ఈ విషయంలో ఇంతకంటే పెద్దగా చెప్పనని, ప్రజలకు రాజ్యాంగంపై విశ్వాసం ఉందని.. అది మరోసారి నిలబడిందని ఆమె అన్నారు. సరైన వేదికపై ఎమ్మెల్యేకున్న హక్కులను న్యాయస్థానం పునరుద్ధరించిందని, పౌరుల హక్కులను రాజ్యాంగమే కాపాడగలదని చెప్పారు. రోజా ఈరోజే అసెంబ్లీకి వెళ్లచ్చని, అసెంబ్లీ కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా ఉత్తర్వులు వెళ్తున్నాయని ఆమె తెలిపారు. -
ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఏర్పడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. రోజా తరఫున సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపంచారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, నిబంధనల ప్రకారం కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెన్షన్ విధించే అధికారం స్పీకర్‌కు ఉందని, అదికాదని ఏడాదిపాటు విధించడానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారం లేదని రోజా అన్నారు. ఈ అంశంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొలుత దాన్ని విచారించడానికి కూడా హైకోర్టులో ఆమోదం లభించలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. దాంతో హైకోర్టులో బుధవారం ఈ అంశంపై వాడివేడి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తన మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.