ఎమ్మెల్యే రోజాకు హైకోర్టులో ఊరట
వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హైకోర్టులో ఊరట లభించింది. రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రోజా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం కూడా ఏర్పడింది. అసెంబ్లీకి రోజా హాజరు కావచ్చని హైకోర్టు తన ఉత్తర్వులలో పేర్కొంది. రోజా తరఫున సుప్రీంకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపంచారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాపై ఏపీ అసెంబ్లీ ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే, తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, నిబంధనల ప్రకారం కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెన్షన్ విధించే అధికారం స్పీకర్‌కు ఉందని, అదికాదని ఏడాదిపాటు విధించడానికి అసెంబ్లీ నిబంధనల ప్రకారం కూడా అధికారం లేదని రోజా అన్నారు.
ఈ అంశంపైనే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొలుత దాన్ని విచారించడానికి కూడా హైకోర్టులో ఆమోదం లభించలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పింది. దాంతో హైకోర్టులో బుధవారం ఈ అంశంపై వాడివేడి వాదనలు జరిగాయి. వాదనల అనంతరం తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. గురువారం నాడు హైకోర్టు ధర్మాసనం ఈ అంశంపై తన మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.