susupicious death
-
నీటి తొట్టిలో 12 రోజుల పసికందు మృతదేహం, అసలు ఏం జరిగింది..?
ఏలూరు టౌన్: ఓ ప్రైవేట్ ఆస్ప్రతిలో చికిత్స కోసం వచ్చి, అమ్మ ఒడిలో ఉండాల్సిన ఓ పసికందు.. అదే ఆస్పత్రి ఆవరణలో ఓ నీళ్ల తొట్టెలో అనుమానాస్పద స్థితిలో నిర్జీవంగా పడి ఉంది. ఏలూరు నగరంలోని సాయి చిల్డ్రన్ హాస్పిటల్లో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం రేమల్లికి చెందిన కలపాల నాగేశ్వరరావు కుమారుడు హరికృష్ణకు ఆరేళ్ల క్రితం చాట్రాయి మండలానికి చెందిన సీతామహాలక్ష్మితో వివాహమైంది. ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. సీతామహాలక్ష్మి ఏలూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో జూలై 30న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో ఈనెల 8న ఏలూరు శంకరమఠం వీధిలోని సాయి చిల్ట్రన్ హాస్పిటల్లో చేర్పించారు. చిన్నారికి గొంతులో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఈఎన్టీ వైద్యునితో చికిత్స చేయించారు. పరిస్థితి మెరుగుపడటంతో బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. హాస్పిటల్లో సీతామహాలక్ష్మి, ఆమె తల్లి, భర్త హరికృష్ణ ఉన్నారు. హరికృష్ణ తండ్రి నాగేశ్వరరావు రేమల్లి నుంచి బస్సులో ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో దిగి కుమారుడికి ఫోన్ చేసి చెప్పగా బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హరికృష్ణ వెళ్లి తండ్రిని హాస్పిటల్‌కు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే పసిబిడ్డ కనిపించటంలేదని సీతామహాలక్ష్మి భర్తకు చెప్పడంతో ఆందోళనకు గురైన హరికృష్ణ, అతని తండ్రి గాలించగా హాస్పిటల్ ఆవరణలోని నీటితొట్టెలో పసికందు మృతదేహం కనిపించింది. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో డీఎస్పీ డాక్టర్ దిలీప్‌కిరణ్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్, ఎస్ఐ నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో హరికృష్ణ తండ్రిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో తాను బాత్రూమ్కి వెళ్లానని సీతామహాలక్ష్మి చెప్పగా, ఆమె తల్లి తాను హాస్పిటల్ పైకి వెళ్లానని చెప్పినట్లు తెలిసింది. -
ప్రశాంతి నిలయంలో కలకలం
- సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్ మాజీ రిసోర్స్ కో-ఆర్డినేటర్ అనుమానాస్పద మృతి - మృతురాలిది ఢిల్లీ - నాలుగు నెలల కిందట ఆ పదవికి రాజీనామా - మనస్పర్థలతో భర్తకు దూరం - విద్యావాహిని కార్యాలయంలో ప్రవేశంపై సందేహాలు ఆమెది ఢిల్లీ. ఉన్నత విద్యావంతురాలు. పుట్టపర్తి సత్యసాయిబాబాపై భక్తికొద్దీ పుట్టపర్తికి వచ్చారు. నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పదస్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. - పుట్టపర్తి టౌన్ పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్ కార్యాలయంలో ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన సాయిప్రవ పట్నాయక్(32) అనుమానాస్పదస్థితిలో మరణించడం బుధవారం వెలుగులోకి వచ్చిందని సీఐ బాలసుబ్రమణ్యం, ఎస్ఐ వెంకటేశ్ నాయక్ తెలిపారు. వారి కథనం మేరకు... సాయిప్రవ పట్నాయక్ 2015 సెప్టెంబర్ 3న సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్‌లో రిసోర్స్ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు పని చేసిన ఆమె మార్చిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాలుగేళ్ల కిందట పుట్టపర్తికి వచ్చిన ఆమె ఇక్కడి గోపురం మొదటి క్రాస్‌లోని అనూరాధ అపార్ట్మెంట్లో ఓ గది అద్దెకు తీసుకుని ఉండేవారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు తన గది నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అక్కడి సాయిభక్త నివాస్ వద్ద గల విద్యావాహిని ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉరికి వేలాడుతూ ఉండగా బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది గమనించి ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యజిత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. భర్తకు దూరంగా... సాయిప్రవ పట్నాయక్‌కు పెళ్లైన నాలుగేళ్లైంది. అయితే పెళ్లైన నెలకే ఆమె భర్తను వదిలేసి బాబాపై భక్తితో ఇక్కడికి వచ్చేశారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడ ఒంటరిగా ఉండేవారు. రెండేళ్ల పాటు ఇక్కడ ఉద్యోగం చేశాక తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. రంగంలోకి పోలీసులు సమాచారం అందిన వెంటనే సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. వారి తల్లిదండ్రులు జెగ్ని పట్నాయక్, మకరంద్ పట్నాయక్‌కు విషయం తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నెన్నో సందేహాలు సాయిప్రవ పట్నాయక్ అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్న విద్యావాహిని కార్యాలయాన్ని ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 9 గంటలలోపు మూసివేస్తారు. అయితే మూసివేసిన కార్యాలయంలోకి ఆమె ఎలా వెళ్లగలిగారు, గది తాళాలు ఎలా దొరికాయి అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఏదైనా చేశారా, అదే నిజమైతే ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
యువకుడి అనుమానాస్పద మృతి
హిందూపురం అర్బన్ : పట్టణంలోని గుడ్డం రంగనాథస్వామి ఆలయం సమీపాన రైల్వేట్రాక్ వద్ద ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రైలులోంచి జారిపడి చనిపోయాడా.. లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ప్రాణం కోల్పోయాడా అన్నది తెలియడం లేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని రైల్వే ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియజేయాలని కోరారు.