ప్రశాంతి నిలయంలో కలకలం | man susupicious death in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

ప్రశాంతి నిలయంలో కలకలం

Published Wed, Jun 7 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

ప్రశాంతి నిలయంలో కలకలం

- సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్‌ మాజీ రిసోర్స్‌ కో-ఆర్డినేటర్‌ అనుమానాస్పద మృతి
- మృతురాలిది ఢిల్లీ
- నాలుగు నెలల కిందట ఆ పదవికి రాజీనామా
- మనస్పర్థలతో భర్తకు దూరం
- విద్యావాహిని కార్యాలయంలో ప్రవేశంపై సందేహాలు


ఆమెది ఢిల్లీ. ఉన్నత విద్యావంతురాలు. పుట్టపర్తి సత్యసాయిబాబాపై భక్తికొద్దీ పుట్టపర్తికి వచ్చారు. నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె అనుమానాస్పదస్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. - పుట్టపర్తి టౌన్‌  

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ఢిల్లీలోని ద్వారక ప్రాంతానికి చెందిన సాయిప్రవ పట్నాయక్‌(32) అనుమానాస్పదస్థితిలో మరణించడం బుధవారం వెలుగులోకి వచ్చిందని సీఐ బాలసుబ్రమణ్యం, ఎస్‌ఐ వెంకటేశ్‌ నాయక్‌ తెలిపారు. వారి కథనం మేరకు... సాయిప్రవ పట్నాయక్‌ 2015 సెప్టెంబర్‌ 3న సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్ట్‌లో రిసోర్స్‌ కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల పాటు పని చేసిన ఆమె మార్చిలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. నాలుగేళ్ల కిందట పుట్టపర్తికి వచ్చిన ఆమె ఇక్కడి గోపురం మొదటి క్రాస్‌లోని అనూరాధ అపార్ట్‌మెంట్‌లో ఓ గది అద్దెకు తీసుకుని ఉండేవారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు తన గది నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్లారు. అక్కడి సాయిభక్త నివాస్‌ వద్ద గల విద్యావాహిని ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ఉరికి వేలాడుతూ ఉండగా బుధవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది గమనించి ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సత్యజిత్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

భర్తకు దూరంగా...
సాయిప్రవ పట్నాయక్‌కు పెళ్లైన నాలుగేళ్లైంది. అయితే పెళ్లైన నెలకే ఆమె భర్తను వదిలేసి బాబాపై భక్తితో ఇక్కడికి వచ్చేశారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడ ఒంటరిగా ఉండేవారు. రెండేళ్ల పాటు ఇక్కడ ఉద్యోగం చేశాక తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు.

రంగంలోకి పోలీసులు
సమాచారం అందిన వెంటనే సీఐ, ఎస్‌ఐ తమ సిబ్బందితో రంగంలోకి దిగారు. వారి తల్లిదండ్రులు జెగ్ని పట్నాయక్‌, మకరంద్‌ పట్నాయక్‌కు విషయం తెలిపారు. మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు.

ఎన్నెన్నో సందేహాలు
సాయిప్రవ పట్నాయక్‌  అనుమానా‍స్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకున్న విద్యావాహిని కార్యాలయాన్ని ప్రతి రోజు రాత్రి 8.30 నుంచి 9 గంటలలోపు మూసివేస్తారు. అయితే మూసివేసిన కార్యాలయంలోకి ఆమె ఎలా వెళ్లగలిగారు, గది తాళాలు ఎలా దొరికాయి అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఏదైనా చేశారా, అదే నిజమైతే ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చిందనే వివరాలన్నీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 

Advertisement
Advertisement
Advertisement