కృతఘ్నతకు తోడు కుటిలత్వం
నమ్మిన వారికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు
అగ్నికి ఆజ్యంలా దాన్ని ఎగదోస్తున్న యనమల
టీడీపీ ఆశావహుల ఆక్రోశం
పార్టీకి నష్టమంటున్న శ్రేణులు
పిఠాపురం, రాజోలుల్లో రగిలిన నిరసన
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘విస్తరి ముందు కూర్చుని, వడ్డన కోసం ఎదురు చూస్తుండగా.. వడ్డించడం మాట అటుంచి, విస్తరినే లాగి పారేస్తే ఎలా ఉంటుంది?’.. ఈ ప్రశ్నకు సమాధానం జిల్లాలో తెలుగుదేశం పార్టీలోని ఆశావహులను అడిగితే సరైన సమాధానం దొరుకుతుంది. ‘పార్టీ అధికారానికి దూరమైన గత పదేళ్లుగా.. వ్యయప్రయాసలకోర్చి, పార్టీ ఉనికిని నిలబెడుతూ వచ్చిన తమకు సార్వత్రిక ఎన్నికల్లో.. అధినేత చంద్రబాబు మొండిచెయ్యి చూపినట్టు’ ఉంటుందని వారు బల్లగుద్ది చెపుతారు.
బాబు తీరుకు యనమల కుతంత్రం తోడై తమకు అవకాశం దూరమవుతోందని ఫూషిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఎంతో ఆశతో ఎదురుచూసిన జిల్లా తెలుగుదేశం నాయకుల్లో ఎందరికో.. అధినేత చంద్రబాబు నాయుడి వైఖరి అశనిపాతంగా మారింది. ‘అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో’ అన్నట్టు.. ఎన్నాళ్ల నుంచో పార్టీని నమ్ముకున్న వారిని కాదని, ఎన్నికల ముందు వచ్చి చేరిన వారికి టిక్కెట్లు కట్టబెట్టడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
‘సెగ పెట్టే వాడికి ఎగదోసే వాడు తోడు’ అన్నట్టు.. నమ్మిన వారిని నట్టేట ముంచే చంద్రబాబు వంచనాశిల్పానికి సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు నగిషీలు చెక్కుతున్నారని కన్నెర్రజేస్తున్నాయి.పిఠాపురంలో పార్టీ కోసం లక్షలు తగలేసుకున్న ఎస్వీఎస్ వర్మకు టిక్కెట్టు ఇవ్వకపోవడంపై ఆ నియోజకవర్గ నాయకులు పార్టీ పదవులకు, అనుబంధ కమిటీలకు శుక్రవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా పిఠాపురంలో ర్యాలీ నిర్వహించి, వర్మకు టిక్కెట్టు ఇవ్వాలని, లేకుంటే తమ రాజీనామాలను ఆమోదించాలని అల్టిమేటమ్ ఇచ్చారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో పలువురు ఆమరణదీక్షకు కూడా దిగారు.
ప్రతిక్రియకు సిద్ధమవుతున్న వర్మ..?
పెద్దదిక్కని చెప్పుకొనే యనమల పిఠాపురంలో పాతమిత్రురాలైన సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీతను తిరిగి పార్టీలోకి తెచ్చి, టిక్కెట్టు ఇప్పించేందుకే ఇదంతా చేస్తున్నారని వర్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అధిష్టానం దృష్టికి ఫ్యాక్స్ ద్వారా నిరసనను తెలియచేసినా కనీస స్పందన లేదని హతాశులవుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బండారు సత్యానందరావులతో పాటు మాజీ మంత్రి తోట నరసింహంను ‘సైకిల్’ ఎక్కించి టిక్కెట్లు కట్టబెట్టిన అధినేత పిఠాపురంలో కూడా అదే చేస్తున్నారని, దాన్ని యనమల ప్రోత్సహిస్తున్నారని ద్వితీయశ్రేణి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా గీత శనివారం నేరుగా టీడీపీ బి ఫారంతో వస్తారని ప్రచారం జరుగుతుండడంతో వర్మ కూడా ప్రతిక్రియకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి అనుచరులతో రాజీనామాలు చేయించిన వర్మ గీత టీడీపీ బి ఫారంతో నామినేషన్ వేయబోతే అడ్డుకునేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది.