జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరిచేది నేడే
ఖమ్మం గాంధీచౌక్: బ్యాంకుల్లో ప్రతి వ్యక్తికీ ఖాతాలు తెరిచేలా గురువారం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ‘జన్-ధన్ యోజన’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ ఎస్.వి.వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని ఆంధ్రాబ్యాంక్ ఏజీఎం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకింగ్ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావటం కోసం దీన్ని ఏర్పాటు చేశారన్నారు.
‘మేరా ఖాతా భాగ్య విధాత’ అనే నినాదంతో దీన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. గురువారం ఒక్క రోజునే దేశవ్యాప్తంగా మూడు లక్షల మందికి బ్యాంక్ ఖాతాలు తెరవాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఖాతాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ‘రూపే’ డెబిట్ కార్డు ఇస్తారని తెలిపారు. దీనిలో భాగంగా జీరో బ్యాలెన్స్ ఖాతాలను ప్రారంభించుకునే అవకాశాన్ని కూడా కల్పించారని చెప్పారు. రూపే కార్డు ద్వారా ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు. రూపే కార్డున్న వారికి రూ. లక్ష బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. వరంగల్ జోన్ పరిధిలోని ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 14 వేల నూతన ఖాతాలను తెరవాలని నిర్ణయించామన్నారు. ఖమ్మం జిల్లాలోని 35, వరంగల్ జిల్లాలోని 36 బ్రాంచీల పరిధిలో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామసభలు కూడా నిర్వహించి ఖాతాలను తెరుస్తామని తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వాలు నిర్వహించే పలు పథకాలను అనుసంధానం చేస్తారని తెలిపారు. ఆయా పథకాల ఫలాలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి చేరుతాయని తెలిపారు. ఆంధ్రాబ్యాంక్‌తో పాటు అన్ని బ్యాంక్‌లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. 2014 మార్చి 31 వరకు చెల్లించాల్సిన పంట రుణాలు, వ్యవసాయం నిమిత్తం బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని, ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు మాఫీ వస్తుందని వరంగల్ జోన్ ఆంధ్రాబ్యాంక్ జోనల్ ఆఫీసర్ సి. ధనుంజయ అన్నారు.
ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు అర్హత ప్రకారం రైతుల ఖాతాలకు ఈ మొత్తం జమవుతుందన్నారు. పంట రుణాలు ఒక లక్ష రూపాయల వరకు వడ్డీలేని రుణాలుగా పొందవచ్చు అని చెప్పారు. రూ.లక్ష నుండి 3 లక్షల వరకు పావులా వడ్డీకి పొందవచ్చునని తెలిపారు. రుణాలు పొందితే వివిధ పంటలకు అమల్లో ఉన్న పంట బీమా పథకం వర్తిస్తుందని కూడా అన్నారు. ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 15 వరకు పంటల బీమా పథకం పొడిగించబడిందని చెప్పారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.