కాలేయ పునరుత్పత్తికి మందు!
న్యూయార్క్: కాలేయం, పెద్ద పేగు, ఎముక మజ్జ క్షీణిస్తే.. వాటిని తిరిగి బాగుచేయొచ్చు. ఇందుకు ఉపయోగపడే ఓ ఔషధాన్ని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ఎస్డబ్ల్యూ033291’ అనే ఈ మందుతో ఎలుకలపై ప్రయోగించగా.. కణజాలాన్ని చాలా వేగంగా పునరుత్పత్తి చేసి దెబ్బతిన్న అవయవాలను పునరుద్ధరించిందని వారు వెల్లడించారు.
ఎముక మజ్జ క్షీణించి చనిపోయే దశకు చేరిన ఎలుకలు సైతం ఈ ఔషధంతో కోలుకున్నాయని వర్సిటీ పరిశోధకుడు మార్కోవిజ్ తెలిపారు. కణజాలాన్ని ఉత్పత్తి చేసే మూలకణాలకు ఈ మందు విటమిన్‌లా పనిచేస్తుందన్నారు. ఈ ఔషధంతో అనేక వ్యాధులకు సమర్థమైన చికిత్స చేయవచ్చన్నారు. ప్రస్తుతం దీనిని మనుషుల్లో ఉపయోగించేందుకు అభివృద్ధిపరుస్తున్నామని తెలిపారు. కాగా, కణజాలాలను ఉత్పత్తి చేసే మూలకణాల వ్యాప్తికి ఉపయోగపడే ప్రోస్టగ్లాండిన్ ఈ2(పీజీఈ2) అనే అణువుల మాదిరిగా పనిచేసేలా ఈ మందును తయారు చేశారు.
పీజీఈ2 అణువుల సంఖ్య పెరిగేందుకు లేదా తగ్గేందుకు 15-పీజీడీహెచ్ అనే జన్యువు ప్రభావం చూపుతుందని గతంలో తేలింది. అయితే, తాజా పరిశోధనలో ఆ జన్యువును క్రియారహితం చేసేలా ఎస్డబ్ల్యూ033291 ఔషధాన్ని తయారు చేశారు. ఇదిలాఉండగా.. ఎముకల క్షీణతను నివారించేందుకు గాను ఫ్లోరిడాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఓ కొత్త చికిత్సను కనుగొన్నారు. ఎముకల క్షీణత ఉన్న రోగుల్లో ఈ చికిత్స ద్వారా.. ఓ ప్రొటీన్‌ను నియంత్రించడం ద్వారా కొత్త ఎముకను ఏర్పర్చే కణాలను అభివృద్ధిపర్చవచ్చని వారు తెలిపారు.