పరిశుభ్రతా దినంగా గాంధీజయంతి
భివండీ, న్యూస్‌లైన్ : ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో కమిషనర్ జీవన్ సోనావునే నాయకత్వంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పారిశుద్ధ్య చర్యలను ప్రారంభించారు. కార్పొరేషన్ మూడవ అంతస్తులోని సమావేశ మందిరంలో జీవన్ సోనావునే, డిప్యూటీ కమిషనర్ విజయ కంఠేతోపాటు ఇతర అధికారులు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
స్వచ్ఛతలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లోని తెలుగు సేవ సంస్థలు, కార్పొరేటర్లు తమ పరిసర మురికి కాలువలతో పాటు రోడ్లను శుభ్రపరిచారు. భివండీ కార్పోరేషన్ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. స్వచ్ఛతను ఎళ్లవేలలా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఉండే పద్మనగర్ ప్రాంతంలోని బాలాజీ సేవ సోసైటీ, బాలాజీ మిత్ర మండల్ కార్యకర్తలు ఉదయం తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికి కాలువలు, రోడ్లను శుభ్రపర్చారు.
సోసైటీ అధ్యక్షులు పూల రవి మాట్లాడుతూ...ప్రధాన మంత్రి చేపట్టిన స్వచ్ఛతా భారత్ అభియాన్‌ను ప్రతి భారతీయుడు పాటించాలని అన్నారు. కామత్‌ఘర్‌లోని బీజేపీ కార్పోరేటర్ హనుమాన్ చౌదరి కార్యాకర్తలతో కలిసి వార్డులోని పరిసర ప్రాంతాల్లో గల రోడ్లను ఊడ్చారు. మరి కొంత మంది స్థానికులు కార్పొరేటరును చూసి పరిసర ప్రాంతంలో గల రోడ్లను ఊడ్చారు.