Swami Nathan
-
ఎస్బీఐ తెలంగాణ సీజీఎంగా స్వామినాథన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా కొత్త బాస్ రానున్నారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్ జానకిరామన్ సీజీఎంగా రానున్నారు. ప్రస్తుతమున్న సీజీఎం హర్దయాల్ ప్రసాద్ పదోన్నతి మీద ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ హెడ్‌గా బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మరో నెల పాటు హర్దయాల్ ప్రస్తుత పదవిలోనే కొనసాగుతారని.. ఆ తర్వాతే స్వామినాథన్ బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇదే విషయమై ఎస్బీఐ ప్రధాన కార్యాలయం నుంచి మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్వామినాథన్ ఎస్బీఐ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ గ్రూప్ జీఎంగా పనిచేస్తున్నారు. యాంటీ మనీ లాండరింగ్‌లో అసోసియేషన్ ఆఫ్ సర్టిఫైడ్ పూర్తి చేశారు. కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్ వంటి వాటిల్లో అపారమైన అనుభవముంది. ఎస్బీఐలో ఎస్‌బీహెచ్‌తో పాటు మరో 4 అసోసియేట్ బ్యాంకుల విలీనం తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఎస్బీఐకి తెలంగాణలో 1,300 శాఖలు, 10 ఇన్ టచ్ బ్రాంచీలు, 2,964 ఏటీఎంలున్నాయి. నేడు యోనో యాప్ ఆవిష్కరణ... ఎస్బీఐ దేశంలోనే తొలిసారిగా పూర్తిస్థాయి డిజిటల్ సర్వీస్ ఫ్లాట్‌ఫామ్ యోనో (వైవోఎన్‌వో) ఓమ్నీ చానల్ యాప్‌ను విడుదల చేయనుంది. ఢిల్లీలో ఆర్థ్ధికమంత్రి జైట్లీ నేడు (శుక్రవారం) ఈ యాప్‌ను విడుదల చేయనున్నట్లు ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యోనోలో ఆర్థిక, బీమా సేవలతో పాటూ విద్యా, వైద్యం, వినోదం, పర్యాటకం వంటి 14 విభాగాల్లో సేవలను పొందొచ్చు. ఇందుకోసం అమెజాన్, ఉబెర్, ఓలా, మింత్రా, జబాంగ్, షాపర్స్ స్టాప్, కాక్స్ అండ్ కింగ్స్, థామస్ కుక్, యాత్ర, ఎయిర్ బీఎన్బీ, స్విగ్గీ, బైజూస్ వంటి 60కి పైగా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. -
‘రైతు’పై లోక్‌సభలో రచ్చ
♦ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న కాంగ్రెస్ ♦ స్వామినాథన్ సిఫారసులపై ఏం చేశారని ప్రశ్న ♦ విపక్షానివి మొసలి కన్నీళ్లేనన్న కేంద్ర మంత్రి అనంత్ ♦ సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. కోరం లేక రాజ్యసభ వాయిదా న్యూఢిల్లీ: రైతు సమస్యలపై శుక్రవారం లోక్‌సభ వేడెక్కింది. దేశవ్యాప్తంగా అన్నదాత ఇబ్బందులకు మీరంటే మీరేనని అధికార, విపక్షాలు విమర్శించుకోవటం, స్పీకర్ పోడియం వద్ద నిరసనలు చేయటంతో సభ నినాదాలతో దద్దరిల్లింది. రైతులు రోడ్లపైకి వస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రభుత్వానికి అసలు రైతు సమస్యలు పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించింది. ప్రధాని సమాధానం ఇవ్వని కారణంగా సభనుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై ప్రభుత్వం మండిపడింది. రైతు సమస్యలపై 60 ఏళ్లుగా కాంగ్రెస్ మొసలికన్నీరు కారుస్తోందని ప్రతివిమర్శలు చేసింది. అటు రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ కోరం లేక సభ వాయిదా పడింది. స్వామినాథన్ సిఫారసుల అమలేది? లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు దీపేందర్ సింగ్ హుడా రైతు సమస్యలపై చర్చను లేవనెత్తారు. ‘మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చారు. సభలో దీనిపై చర్చ జరిగినా ప్రధాని నుంచి స్పందన లేదు’ అని ఆయన విమర్శించారు. ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలుచేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఇంతలోనే ప్రధాని స్పందించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ కాసేపు సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత జీరో అవర్‌లోనూ కాంగ్రెస్ సభ్యులు ఇదే డిమాండ్‌తో నిరసన తెలిపింది. అనంతరం.. ప్రధాని రైతు సమస్యలపై స్పందించకపోవటంతో వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌వి మొసలి కన్నీళ్లు! స్పీకర్ పోడియం వద్ద కాంగ్రెస్ సభ్యుల నినాదాలు, హుడా ప్రసంగంపై అధికార పక్షం దీటుగానే స్పందించింది. 60 ఏళ్లుగా రైతుల కోసం కాంగ్రెస్ ఏం చేసిందని బీజేపీ ఎంపీలు సభలో మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా మరింత నష్టాల్లోకి వ్యవసాయాన్ని నెట్టేశారంటూ ప్రతివిమర్శలు చేశారు. రైతు సమస్యలపై 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ విమర్శించారు. వ్యవసాయ సమస్యలపై బుధవారం జరిగిన చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పారిపోయిందని ఎద్దేవాచేశారు. రైతులకు ఎరువులు అందుబాటులోకి తీసుకురావటం మొదలు పంట బీమా వరకు ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం మూడేళ్లుగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అనంత్ కుమార్ తెలిపారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోలిస్తే దేశంలో వైద్యుల కొరత స్పష్టంగా ఉందని ప్రభుత్వం లోక్‌సభకు వెల్లడించింది. ప్రతి వెయ్యి మందికి కనీసం ఒక్క డాక్టర్ కూడా లేని పరిస్థితులు దేశంలో ఉన్నాయని వైద్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో.. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగించినప్పటికీ కొన్ని పత్రికలు, చానెళ్లు ప్రసారం చేయటంపై ఆ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభ చైర్మన్ హమీద్ అన్సారీ జోక్యం చేసుకుని ఆయా మీడియా సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కాగా, ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దాలనుకోవటం లేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో స్పష్టం చేసింది. హిందీ అధికారిక భాష అయినప్పటికీ.. అన్ని భాషలను జాతీయ భాషలుగానే గుర్తిస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం 38 భాషలకు త్వరలోనే అధికారిక భాష హోదా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. అయితే రాజ్యసభలో పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికీ సరైన కోరం (కనీసం 25 మంది ఉండాల్సి ఉండగా 23 మందే సభలో ఉన్నారు) లేని కారణంగా సభ వాయిదా పడింది. 19వేల కోట్ల నల్లధనం గుర్తింపు న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ అకౌంట్లతోపాటుగా ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.19 వేల కోట్ల భారతీయుల నల్లధనాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. ఐసీఐజే, హెచ్ఎస్బీసీ నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. 700 మంది భారతీయులు అనుమానాస్పదంగా విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై విచారణ సందర్భంగా ఈ వివరాలు వెల్లడయ్యాయన్నారు. దీనికి సంబంధించిన 31 కేసుల్లో 72 ఫిర్యాదులను క్రిమినల్ కోర్టుల్లో దాఖలు చేసినట్లు వెల్లడించారు. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఖాతాలున్న 628 మంది భారతీయుల వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం అందజేసిందన్నారు. ‘ప్రభుత్వ సంస్థల విచారణ సందర్భంగా రూ.8,437 కోట్ల నల్లధనాన్ని మే 2017 వరకు దేశానికి తీసుకొచ్చాం. 162 కేసుల్లో రూ.1,287 కోట్ల జరిమానా విధించాం. 84 కేసుల్లో 199 క్రిమినల్ ప్రాసిక్యూషన్ కేసులు దాఖలు చేశాం’ అని జైట్లీ వెల్లడించారు. పనామా పేపర్ల లీక్ సమయంలోనే (ఏప్రిల్ 2016లో) ప్రభుత్వం వివిధ విచారణ సంస్థల బృందం (ఎమ్‌ఏజీ)ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే.