దుర్గగుడిలో అన్యమత ప్రచారంపై నిరసన
దుర్గగుడిలో పనిచేస్తున్న ఉద్యోగులే అన్యమత ప్రచారానికి పూనుకుంటున్నారంటూ స్వామి శ్రీనివాసానంద సరస్వతి శనివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై నిరసన వ్యక్తం చేశారు.
♦ కేశఖండనశాలలో అన్యమత ప్రచారకులపై కేసులు పెట్టాలి
♦ అన్యమతాలకు చెందిన 30 మందిని తొలగించాలి
♦ ఇంద్రకీలాద్రిపై ఉన్న చర్చిని వెంటనే తీసివేయాలి
♦ ఇంద్రకీలాద్రి అమ్మవారిదే..
♦ ఆనందాశ్రమం స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్
సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో అన్యమత ప్రచారం జరగడాన్ని నిరసిస్తూ హిందూ ధర్మరక్ష సమన్వయ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇంద్రకీలాద్రిపై ధర్నా నిర్వహించారు. అన్యమత ప్రచారం గురించి దుర్గగుడి ఈవోను కలిసి తమ నిరసనను తెలియజేసేందుకు శ్రీకాకుళం ఆనందాశ్రమం స్వామీజీ, ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామీ శ్రీనివాసానంద సరస్వతి, సమితి ప్రతినిధులతో కలిసి వచ్చారు. అయితే, స్వామీజీ వచ్చిన విషయం ఈవో సీహెచ్ నర్సింగరావు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీనికి తోడు దేవస్థానం సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారు అక్కడే ధర్నాకు దిగారు.
ఈవో వచ్చి తమతో మాట్లాడిన తరువాతే అక్కడ నుంచి వెళ్తామంటూ పట్టుబట్టారు. రాత్రి 9.30 గంటలకు ఈవో వచ్చారు. ఆయన్ను చూడగానే హిందూ ధర్మ రక్ష సమన్వయ సమితి ప్రతినిధులు ఒక్కసారిగా చుట్టముట్టారు. వారిని చూసి దేవస్థానం ఉద్యోగులు వాగ్వివాదానికి దిగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఒక దశలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కేశఖండనశాలలో క్షురకుడు భాస్కర్‌తో పాటు మరికొంతమంది అన్యమత ప్రచారం చేస్తున్నట్లు భక్తులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు పట్టించుకోలేదంటూ స్వామీజీ ఈవోను నిలదీశారు. దేవాలయంలో సుమారు 30 మంది అన్యమతస్తులు పనిచేస్తున్నారని, వారందరినీ తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు.
సాక్షి గణపతి దేవాలయం పక్కనే ఉన్న చర్చిలో అన్యమత ప్రచారం జరుగుతోందని, ఆలయ ప్రాంగణంలో కొంతమంది ఉద్యోగులు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఈవో స్పందిస్తూ అన్యమత ప్రచారం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటానని, కేశఖండన శాలలో అన్యమత ప్రచారం జరగడంపై విచారణ చేయించి బాధ్యుల్ని విధుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. అమ్మవారికి జరిగే పూజలు, నైవేద్యాల విషయంలో ఏవిధమైన కోతలు పెట్టడం లేదని ఆయనకు వివరించారు.
అనంతరం స్వామీజీ విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది తిరుమల, సింహాచలం, అంతర్వేది, ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారాలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతిస్తున్నారన్నారు. ఈవో తమకు ఇచ్చిన హామీలను వారంలో పూర్తి చేయకపోతే ఇంద్రకీలాద్రిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో సమితి అధ్యక్షుడు గౌరయ్య, కార్యదర్శి రామాం జనేయులు, న్యాయవాదులు యాబలూరి లోకనాథశర్మ, కృష్ణ, బీజేపీ నాయకుడు యేలేశ్వరపు జగన్మోహనరాజు తదితరులు పాల్గొన్నారు.