swamy narayanBoarding school
-
రాష్ట్రంలో మూడు స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ స్కూళ్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శ్రీస్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ తెలియజేసింది. సీఎం జగన్‌ను సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని వారు తెలియజేయగా.. ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కాగా, వైఎస్సార్ హయాంలో తెలంగాణలోని మొయినాబాద్‌లో గురుకుల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు సన్నాహాలు జరిగాయని.. కానీ ఆయన అకాల మరణంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని సీఎంకు ప్రతినిధుల బృందం వివరించింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, న్యూఢిల్లీతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలలో 52కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయని తెలియజేసింది. సమావేశంలో ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి, విజయవాడ బ్రాంచ్ ఆర్గనైజర్ మంత్రస్వరూప్ స్వామి, ట్రస్ట్ సభ్యులు శ్రవణ్‌ప్రియ్ స్వామి, విషుద్జీవన్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. -
‘గురుకుల్’లో లక్ష్మణ్ సందడి
మొయినాబాద్ సమీపంలోని స్వామినారాయణ్ గురుకుల పాఠశాలలో భారత జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సందడి చేశారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సరదాగా వారితో కాసేపు క్రికెట్ ఆడారు. మొయినాబాద్ రూరల్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి పౌరుడూ పాటుపడాలని ప్రముఖ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండలంలోని హిమాయత్‌నగర్ సమీపంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో క్రికెట్ ఆడారు. ఈ సందర్బంగా ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు అతిచేరువలో ఉన్న ఇంతటి ఘనమైన విద్యాలయాన్ని చూడడం ఇదే మొదటిసారి అన్నారు. క్రీడలకు అధిక ప్రాధ్యాన్యం ఇవ్వాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఆటలతోపాటు చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధించి దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని పేర్కొన్నారు. చిన్న వయసులోనే భగవద్గీత పఠనంతో తన జీవితం ధన్యమైందని తెలిపారు. మహానుభావుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకుని, సామాజిక సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం గురుకుల విద్యాలయ స్వామీజీలు లక్ష్మణ్‌ను సన్మానించారు. గురుకుల విద్యాలయంలో నిర ్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందినవారికి లక్ష్మణ్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీదేవప్రసాద్ స్వామీజీ, శక్వల్లభ్ స్వామీజీ, అధ్యాపకులు పాల్గొన్నారు.