సీఎం జగన్‌ను కలిసిన శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ ప్రతినిధులు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శ్రీస్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ తెలియజేసింది. సీఎం జగన్‌ను సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు కలిశారు.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని వారు తెలియజేయగా.. ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు.
ఇందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.
కాగా, వైఎస్సార్ హయాంలో తెలంగాణలోని మొయినాబాద్‌లో గురుకుల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు సన్నాహాలు జరిగాయని.. కానీ ఆయన అకాల మరణంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని సీఎంకు ప్రతినిధుల బృందం వివరించింది.
ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, న్యూఢిల్లీతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలలో 52కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయని తెలియజేసింది. సమావేశంలో ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి, విజయవాడ బ్రాంచ్ ఆర్గనైజర్ మంత్రస్వరూప్ స్వామి, ట్రస్ట్ సభ్యులు శ్రవణ్‌ప్రియ్ స్వామి, విషుద్జీవన్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment