gurukul schools in Andhra Pradesh
-
రాష్ట్రంలో మూడు స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ స్కూళ్లు
సాక్షి, అమరావతి: విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శ్రీస్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ తెలియజేసింది. సీఎం జగన్‌ను సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని వారు తెలియజేయగా.. ఎలాంటి సహకారం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు కూడా సీఎం అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కాగా, వైఎస్సార్ హయాంలో తెలంగాణలోని మొయినాబాద్‌లో గురుకుల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు సన్నాహాలు జరిగాయని.. కానీ ఆయన అకాల మరణంతో ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని సీఎంకు ప్రతినిధుల బృందం వివరించింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, న్యూఢిల్లీతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలలో 52కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయని తెలియజేసింది. సమావేశంలో ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి, విజయవాడ బ్రాంచ్ ఆర్గనైజర్ మంత్రస్వరూప్ స్వామి, ట్రస్ట్ సభ్యులు శ్రవణ్‌ప్రియ్ స్వామి, విషుద్జీవన్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. -
Andhra Pradesh: రోజూ ప్రత్యేక మెనూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రతి రోజు ప్రత్యేక మెనూ అమలు చేయడంతో పాటు టీవీ, ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లలో రెండు దశల్లో, గురుకుల పాఠశాలల్లో మూడు దశల్లో నాడు–నేడు కార్యక్రమాన్ని పటిష్ట కార్యాచరణతో పూర్తి చేయాలని చెప్పారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పర్యవేక్షణకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. గురుకులాల విద్య (అకడమిక్) వ్యవహారాల పర్యవేక్షణను పాఠశాల విద్య (స్కూల్ ఎడ్యుకేషన్) పరిధిలోకి తేవాలని చెప్పారు. మండలాల్లో అకడమిక్ వ్యవహారాలు చూస్తున్న మండల విద్యా శాఖ అధికారు(ఎంఈఓ)లకే గురుకులాల అకడమిక్ బాధ్యతలు అప్పగించాలా.. లేక మరో విధంగా చేయాలా.. అనే విషయంపై పూర్తి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ‘మండలాల్లో ఇద్దరు ఎంఈఓల నియామకం ద్వారా ఏ విధంగా పర్యవేక్షణను పటిష్టం చేస్తున్నామో.. గురుకులాల్లో కూడా అదే తరహాలోనే పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ (ఎస్ఓపీ), ప్రత్యేక యాప్ రూపొందించాలి. గురుకుల పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, భోజనం నాణ్యత, నిర్వహణ తదితర అంశాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరగాలి. ఇందుకోసం ఒక్కో అధికారి ప్రత్యేక పరిధిని నిర్ణయించి సమగ్రంగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. మండలాల్లో స్కూళ్ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమిస్తున్న రెండో ఎంఈవోకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలి’ అని ఆదేశించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో నాడు–నేడు పనులపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాణ్యమైన భోజనం పెట్టాలి ► రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి పెట్టే భోజనం అత్యంత నాణ్యతగా ఉండాలి. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో భోజనంలో నాణ్యత పెంచాలి. ప్రతిరోజూ ఒక మెనూ ఇవ్వాలి. ఈ మేరకు అవసరమైన ప్రతిపాదనలు ఇవ్వండి. ► హాస్టల్ పిల్లలకు ఇచ్చే కాస్మోటిక్స్ సహా వస్తువులన్నీ నాణ్యతతో ఉండాలి. విద్యాకానుకతో పాటు వీటిని కూడా అందించడానికి చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో పారిశుధ్యం, పరిశుభ్రతలపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీని లింక్ చేయడంపై కూడా శ్రద్ధ వహించాలి. హాస్టళ్లలో టాయిలెట్ల నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలి. ► వైద్యులు క్రమం తప్పకుండా హాస్టళ్లకు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాలి. (ఇందుకోసం ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు) విలేజ్ క్లినిక్స్, స్థానిక పీహెచ్‌సీలతో ప్రభుత్వ హాస్టళ్లను మ్యాపింగ్ చేయాలి. హాస్టళ్ల నిర్వహణలో సిబ్బంది ఖాళీలను గుర్తించి, భర్తీ చేయాలి. వీటన్నింటిపై తగిన కార్యాచరణ సిద్ధం చేసి నాకు నివేదించాలి. నాడు–నేడు ప్రతిపాదనలు ఇలా ► రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో నాడు–నేడు కింద టాయిలెట్లు, విద్యుదీకరణ, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పెయింటింగ్, మరమ్మతులు, ప్రహరీ గోడలు, మస్కిటో ఫ్రూఫింగ్ పనులు, సిబ్బందికి.. విద్యార్థులకు ఫరి్నచర్.. డెస్క్‌లు, బంకర్ బెడ్స్, స్టడీ టేబుల్స్, ఛైర్లు, ఆఫీసు టేబుళ్లు, లైబ్రరీ రాక్స్, షూ రాక్స్, డైనింగ్ టేబుల్, గార్బేజ్ బిన్స్ తదితరాలకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. ► కిచెన్ ఆధునికీకరణలో భాగంగా స్టోరేజీ రాక్స్, గ్యాస్ స్టౌవ్స్, గ్రైండర్, పూరి మేకింగ్ మెషీన్, ప్రెషర్ కుక్కర్, ఇడ్లీ కుక్కర్, చిమ్నీ, కుకింగ్ వెసల్స్, డస్ట్ బిన్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. 55 ఇంచ్‌ల స్మార్ట్ టీవీతో పాటు క్రీడా సామగ్రి, లైబ్రరీ బుక్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు తయారు చేశామని తెలిపారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పీడిక రాజన్న దొర, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మేరుగు నాగార్జున, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆరి్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్ఈఐఎస్) నిర్వహిస్తున్న పాఠశాలల్లో 2022–23 విద్యాసంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికై లాటరీ పద్ధతిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని సంస్థ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదివారం ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 12 సాధారణ, 11 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను జూలై 5వ తేదీన ఆటోమేటెడ్ ర్యాండమ్ సెలక్షన్ (లాటరీ) పద్ధతిలో విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు ఏపీఆర్ఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్ ద్వారా రూ.50 రుసుం చెల్లించి, ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. ఆయా తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో దిగువ తరగతులు చదివి ఉండాలని వివరించారు. తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఏడాదికి రూ.లక్షకు మించి ఉండరాదని, తెలుపు రేషన్‌కార్డు కలిగిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఖాళీల వివరాలకు సంస్థ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదో తరగతి, ఇంటర్మీడియట్లలో ప్రవేశాల (అడ్మిషన్ల) కోసం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షలు నిర్వహించారు. ఐదో తరగతిలో 14,940 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 61,670 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 49,890 మంది రాతపరీక్షకు హాజరయ్యారు. వారికి 188 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్, ఐఐటీ, మెడికల్ అకాడమీలలో ప్రవేశానికి 13,560 సీట్లు ఉండగా ఆన్లైన్ ద్వారా 42,831 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 37,492 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 185 కేంద్రాల్లో మధ్యాహ్నాం 2 గంటల నుంచి 4 గంటల వరకు వీరికి రాత పరీక్ష నిర్వహించారు. కాగా, పామర్రు పరీక్షా కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పరిశీలించారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తోపాటు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి ఉన్నారు. -
50 మంది విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మానక్ అవార్డులకు ఎంపికయ్యారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్–2021–2022కు ఎంపిక కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డును సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున పారితోషికం లభించనుందని తెలిపారు. అత్యధికంగా లేపాక్షి బాలుర గురుకులంలో ఐదుగురు, పుంగనూరు(పెదపంజాని) బాలికల గురుకులంలో 4గురు అవార్డులను సాధించారని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులు, పోత్సహించిన ఉపాధ్యాయులను కృష్ణమోహన్ అభినందించారు. -
గురుకులాల గురి కుదిరింది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) గురుకుల విద్యాలయాల్లో మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఎస్సీ గురుకులాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు గురి కుదిరింది. ఎస్సీ గురుకులాల్లో సాధిస్తున్న మెరుగైన ఫలితాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆదరణ పెరుగుతోంది. గురుకులాల విద్యార్థులు మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యధిక మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లోను తమ సత్తా చాటారు. నీట్లో అత్యంత ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు 17 మందికి ఎంబీబీఎస్‌లోను, 21 మందికి బీడీఎస్‌లోను సీట్లు లభించే అవకాశం ఉంది. ఏకంగా 13 మంది విద్యార్థులు నేరుగా ఐఐటీ అడ్మిషన్‌కు అర్హత సాధించారు. 34 మంది ప్రిపరేటరీ ఐఐటీ (ఏడాది తర్వాత ఎటువంటి పరీక్ష లేకుండా అడ్మిషన్)కి అర్హత సాధించగా 37 మంది ఎన్ఐటీకి అర్హత సాధించడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. అదే 2014లో మన రాష్టంలోని ఎస్సీ గురుకుల విద్యాలయాల్లో సాధించిన ఐఐటీ సీటు ఒక్కటి మాత్రమే కావడం గమనార్హం. ఆరోగ్యానికీ ప్రాధాన్యం గురుకులాల విద్యార్థులకు విద్యతోపాటు ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది ‘కంటివెలుగు’ ద్వారా ఎస్సీ గురుకులాల్లో చదివే లక్షమంది విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. 3,326 మందికి దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోడు అందించారు. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా 55,763 మంది బాలికలకు ప్రతినెల పది చొప్పున నాణ్యమైన శానిటరీ న్యాప్కిన్స్ను ఉచితంగా అందిస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధతోనే ఇది సాధ్యమైంది అట్టడుగు వర్గాలకు మెరుగైన విద్యావకాశాలు అందించాలనే లక్ష్యంతో సీఎం జగన్ తీసుకున్న ప్రత్యేకశ్రద్ధ వల్లే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోని 192 ఎస్సీ గురుకులాల్లోను మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేకశ్రద్ధ వహిస్తున్నాం. విద్యార్థులను సబ్జెక్టుల వారీగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఉపాధ్యాయులతో బోధన, ప్రైవేట్ క్లాస్‌లు పెట్టిస్తున్నాం. ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ సీట్లు సాధించడమే ఇందుకు నిదర్శనం. అమ్మఒడి వంటి పథకాలతోపాటు అనేక తోడ్పాటు చర్యలు తీసుకోవడం ద్వారా ఎస్సీ విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువచేసే ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. – పినిపే విశ్వరూప్, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి -
ఆదిమ జాతి బిడ్డలకు అక్షరయోగం
సాక్షి, అమరావతి: వారెప్పుడు పుట్టారో తెలీదు. ఎందుకంటే వారికి పుట్టిన తేదీ ధృవపత్రం లేదు. జనాభా లెక్కల్లో ఉన్నారు. కానీ ఆధార్ కార్డు లేక పాఠశాల అడ్మిషన్ దక్కని దుస్థితి వారిది. గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం నెల్లూరు జిల్లాలోని గిరిజన గూడెంలలో పర్యటించిన అధికారులను విస్తుపోయేలా చేసిన విషయాలివి. ఆదిమ జాతుల బిడ్డలకు అక్షర యోగం కల్పించాలనే మహోన్నత యజ్ఞాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు శని, ఆదివారాలు నెల్లూరు జిల్లాలో పర్యటించాయి. రెండు రోజులపాటు సోమశిల, బుచ్చిరెడ్డిపాలెం, కావలి, సర్వేపల్లి, చేజర్లలోని యానాది (ఎస్టీ) గూడెంలను సందర్శించి అక్కడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, కుల పెద్దలతో సమావేశాలు నిర్వహించాయి. పిల్లల్ని బడిలో చేర్పించేలా వారికి అవగాహన కల్పించాయి. క్షేత్రస్థాయి పరిశీలన అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు (పీవీటీజీ)కి చెందిన పిల్లల్ని బడిలో చేర్పించడం ద్వారా గిరిజన గురుకుల పాఠశాలల్లో 100 శాతం అడ్మిషన్లు సాధించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నేరుగా రంగంలోకి దిగిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె.శ్రీకాంత్ ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పలు తండాలు, గూడెంలలోని పిల్లలకు కనీసం ఆధార్, పుట్టిన తేదీ ధృవపత్రాలు లేక గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు అవరోధం కలగడాన్ని గుర్తించారు. దీంతో ఆధార్ కార్డు నమోదు, పుట్టిన రోజు, కుల ధృవపత్రాలు ఇప్పించి గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టారు. అత్యంత వెనుకబడిన యానాది, చెంచు, కొండరెడ్డి, గోండు తదితర ఆదిమ జాతి పిల్లలను గురుకులాల బాట పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 పీవీజీటీలు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, మినీ గురుకుల పాఠశాలలు మొత్తం 199 ఉన్నాయి. వాటిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు విద్యా బోధన జరుగుతోంది. దాదాపు 32 తెగలకు చెందిన 67 వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. కాగా, వాటిలో 10 గురుకుల పాఠశాలలు అత్యంత వెనుకబడిన ఆదిమ జాతి గిరిజన తెగలు (పీవీటీజీ) పిల్లలకు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మల్లి, విజయనగరం జిల్లా భద్రగిరి, విశాఖ అరకు, తూర్పుగోదావరిలో మారేడుమిల్లి, చింతూరు, గుంటూరులో నాగార్జునసాగర్, ప్రకాశంలో యర్రగొండపాలెం, నెల్లూరులో చిట్టేడు, సోమశిల, కర్నూలులో మహానందిలలో ప్రత్యేక గురుకుల పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఒక్కో పాఠశాలలో 640 సీట్లకు గానూ నేటివరకూ 120 నుంచి 130 సీట్లు కూడా భర్తీ కావటం లేదు. 100 శాతం సీట్ల భర్తీయే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో చదువుల విప్లవం తెచ్చారు. చదువులను ప్రోత్సహించేలా నాడు–నేడు వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఆగష్టు 14 నాటికి 100 శాతం అడ్మిషన్లు సాధించడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు గిరిజన తండాలు, గూడెంలలో పర్యటిస్తున్నాయి. జగనన్న విద్యా కానుక కిట్లు, అమ్మ ఒడి, కాస్మొటిక్ కిట్లు తదితర ప్రోత్సాహకాల గురించి అక్కడి వారికి వివరిస్తున్నాం. గురుకులాల్లో విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వీయ రక్షణకు శిక్షణ, యోగా, అటల్ థింకరింగ్ ల్యాబ్‌లు వంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి పిల్లల్ని బడికి పంపేలా ప్రోత్సహిస్తున్నాం. – కె. శ్రీకాంత్ ప్రభాకర్,ఏపీ గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాల సంస్థ కార్యదర్శి -
ఏపీ: గురుకులాల్లో వినూత్నంగా బోధన
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా చదువుకు నోచుకోలేకపోతున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురుకుల పాఠశాలల పరిధిలో ఆటపాటలతో విద్యార్థులు చదువు కొనసాగేలా గ్రామ అభ్యస బృందాలను (విలేజ్ లెర్నింగ్ సర్కిల్) ఏర్పాటుచేసింది. ఇందుకు జిల్లాకు రెండేసి గురుకులాలను ఎంపికచేసి వాటికి గ్రామ అభ్యస బృందాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఇలా రాష్ట్రంలోని 26 గురుకుల పాఠశాల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులను ఎంపికచేశారు. బోధన ప్రక్రియ ఈ నెల 1 నుంచి మొదలైంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో చదివే విద్యార్థులు ముగ్గురు నుంచి పది మందిని ఒక గ్రూపుగా ఏర్పాటుచేశారు. ఒక్కో గ్రామంలో గురుకుల విద్యార్థులు పన్నెండు మంది కంటే ఎక్కువగా ఉంటే రెండో గ్రూపు ఏర్పాటుచేశారు. ప్రతి బృందానికి విడిగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి వారికి అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లుచేశారు. అలాగే, ప్రతి గ్రూపునకు సబ్జెక్టుల వారీగా విద్యాబోధన చేసేలా ఉపాధ్యాయులను నియమించారు. గ్రామంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ కనీసం గంట నుంచి రెండు గంటలపాటు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. పాఠాలతోపాటు ఆటపాటలు కూడా గురుకుల విద్యార్థులకు నేర్పించి వారిలో ఉత్సాహం నింపేలా చర్యలు చేపట్టడం విశేషం. కాగా, గ్రామ అభ్యస బృందాలకు సీనియర్ విద్యార్థి నాయకత్వం వహిస్తాడు. ఈ బృందాలను పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ వలంటీర్లు పర్యవేక్షిస్తారు. స్పందన బాగుంది రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి ప్రారంభించిన విలేజ్ లెర్నింగ్ సర్కిళ్లకు స్పందన బాగుంది. పూర్తిస్థాయిలో ఈ బృందాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చాం. సెల్ఫోన్లు అందరికీ ఉండే అవకాశం లేనందున నేరుగా గ్రామ అభ్యస బృందం పేరుతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసి నేరుగా ఉపాధ్యాయులే ఆయా సబ్జెక్టుల్లో బోధించే ఏర్పాటుచేశాం. ఒక్కోసారి ఉపాధ్యాయుడు వేరొక ప్రాంతం నుంచి ఆన్లైన్ ద్వారా పాఠాలు చెప్పినా గ్రామ అభ్యస బృందంలో ఏ ఒక్కరైనా మొబైల్ ఫోన్ ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండదు. – బండి నవ్య, ఏపీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ -
ఇంగ్లీష్ మీడియంలో ఇరగదీశారు
- సరాసరి కంటే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ - 4.95 లక్షల మందిలో 4.60 లక్షల మంది పాస్ - మొత్తం విద్యార్థుల్లో సగం ఇంగ్లిషు మీడియం వారే - 10 జీపీఏ సాధించిన వారు 4,085 మంది - ఏపీ గురుకులాల హవా - విడుదలైన పదో తరగతి ఫలితాలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 83.17 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిషు మీడియంలో మాత్రం 92.90 శాతం మంది పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతంతో పోల్చినా ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతమే ఎక్కువగా ఉంది. మార్చి/ఏప్రిల్ నెలల్లో జరిగిన పరీక్ష ఫలితాలను సచివాలయ డి బ్లాక్‌లో గురువారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలకు మొత్తంగా మొత్తంగా 12,15,391 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 10,10,960 మంది విద్యార్థులు (83.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులను మినహాయిస్తే.. రెగ్యులర్ విద్యార్థుల్లో 10,61,703 మంది పరీక్షలకు హాజరుకాగా 9,40,924 మంది (88.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సత్తా చాటిన బాలికలు.. పదో తరగతిలోనూ బాలికలే సత్తా చాటారు. బాలురు 87.96 శాతం వుంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 89.33 శాతం వుంది పాస్ అయ్యూరు. 5,44,538 మంది బాలురు పరీక్షలు రాయగా 4,78,955 మంది (87.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 5,17,165 మంది బాలికలు పరీక్షలు రాయగా 4,61,969 మంది (89.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఏపీ గురుకులాల హవా.. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల హవా కొనసాగింది. వాటిల్లో 95.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఈసారి బాలికల (94.07) కంటే బాలురు (97.68 శాతం) అధిక శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. 99 స్కూళ్లు ఆంధ్రప్రదేశ్ గురుకులాల సొసైటీ పరిధిలో ఉండగా 91 పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 51 స్కూళ్ల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 7,750 మంది పరీక్షలు రాయగా 7,602 మంది (98.1 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 48 గురుకుల బాలుర స్కూళ్లు ఉండగా 28 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు వచ్చాయి. 43 బాలికల పాఠశాలు ఉండగా 23 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనూ బాలికల (90.22 శాతం) కంటే బాలురే (94.15 శాతం) అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల.. ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిషు మీడియం ఉండటమే ఇందుకు కారణం. 3,28,256 మంది విద్యార్థులు 2012లో ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాయగా, గత ఏడాది 4,62,984 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి 4,95,225కు చేరుకుంది. అందులో 4,60,086 మంది (92.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది జీపీఏ గుంటూరులో అధికం..: గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) పదికి పది సాధించిన విద్యార్థులు గుంటూరులో ఎక్కువ మంది ఉన్నారు. మొత్తంగా పది జీపీఏ సాధించిన విద్యార్థులు 4,085 మంది ఉండగా, గుంటూరు జిల్లాలో 586 మంది పది జీపీఏ సాధించారు. ఆ తర్వాత స్థానంలో 562 మందితో రంగారెడ్డి నిలిచింది. పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్యలో విజయనగరం జిల్లా (46 మంది) చివరి స్థానంలో నిలిచింది. గిరిజన గురుకులాల్లో 89.94 శాతం ఉత్తీర్ణత పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోని 77 ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 89.94 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు గురుకులం కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వీరిలో బాలికలు 90.50 శాతం, బాలురు 89.63 శాతమని వివరించారు. 5,606 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా... 5,029 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. సీతంపేట, భద్రగిరి, దమ్మపేట, కొమరాడ, కులకచెర్ల, మల్లి, తుమ్మలవలస, కొయ్యూరు, జి.మాడుగుల బాలుర గురుకుల పాఠశాలలో, భద్రగిరి, కొత్తగూడ, కూనవరం, సీతంపేట, వనపర్తి బాలికల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.