ఆదిమ జాతి బిడ్డలకు అక్షరయోగం | Tribal Welfare Gurukul Schools Institution Special Activity | Sakshi
Sakshi News home page

ఆదిమ జాతి బిడ్డలకు అక్షరయోగం

Published Mon, Aug 2 2021 4:46 AM | Last Updated on Mon, Aug 2 2021 4:46 AM

Tribal Welfare Gurukul Schools Institution Special Activity - Sakshi

నెల్లూరు జిల్లా చేజర్లలోని యానాదిగూడెంలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఏపీ గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె. శ్రీకాంత్‌ ప్రభాకర్, ఇతర అధికారులు

సాక్షి, అమరావతి:  వారెప్పుడు పుట్టారో తెలీదు. ఎందుకంటే వారికి పుట్టిన తేదీ ధృవపత్రం లేదు. జనాభా లెక్కల్లో ఉన్నారు. కానీ ఆధార్‌ కార్డు లేక పాఠశాల అడ్మిషన్‌ దక్కని దుస్థితి వారిది. గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం నెల్లూరు జిల్లాలోని గిరిజన గూడెంలలో పర్యటించిన అధికారులను విస్తుపోయేలా చేసిన విషయాలివి. ఆదిమ జాతుల బిడ్డలకు అక్షర యోగం కల్పించాలనే మహోన్నత యజ్ఞాన్ని చేపట్టిన ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థకు చెందిన ప్రత్యేక బృందాలు శని, ఆదివారాలు నెల్లూరు జిల్లాలో పర్యటించాయి. రెండు రోజులపాటు సోమశిల, బుచ్చిరెడ్డిపాలెం, కావలి, సర్వేపల్లి, చేజర్లలోని యానాది (ఎస్టీ) గూడెంలను సందర్శించి అక్కడి పిల్లలు, వారి తల్లిదండ్రులు, కుల పెద్దలతో సమావేశాలు నిర్వహించాయి. పిల్లల్ని బడిలో చేర్పించేలా వారికి అవగాహన కల్పించాయి. 

క్షేత్రస్థాయి పరిశీలన  
అత్యంత వెనుకబడిన గిరిజన తెగలు (పీవీటీజీ)కి చెందిన పిల్లల్ని బడిలో చేర్పించడం ద్వారా గిరిజన గురుకుల పాఠశాలల్లో 100 శాతం అడ్మిషన్లు సాధించేందుకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. నేరుగా రంగంలోకి దిగిన ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి కె.శ్రీకాంత్‌ ప్రభాకర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పలు తండాలు, గూడెంలలోని పిల్లలకు కనీసం ఆధార్, పుట్టిన తేదీ ధృవపత్రాలు లేక గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లకు అవరోధం కలగడాన్ని గుర్తించారు. దీంతో ఆధార్‌ కార్డు నమోదు, పుట్టిన రోజు, కుల ధృవపత్రాలు ఇప్పించి గురుకులాల్లో చేర్పించే చర్యలు చేపట్టారు. అత్యంత వెనుకబడిన యానాది, చెంచు, కొండరెడ్డి, గోండు తదితర ఆదిమ జాతి పిల్లలను గురుకులాల బాట పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
10 పీవీజీటీలు 
ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, మినీ గురుకుల పాఠశాలలు మొత్తం 199 ఉన్నాయి. వాటిలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు విద్యా బోధన జరుగుతోంది. దాదాపు 32 తెగలకు చెందిన 67 వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. కాగా, వాటిలో 10 గురుకుల పాఠశాలలు అత్యంత వెనుకబడిన ఆదిమ జాతి గిరిజన తెగలు (పీవీటీజీ) పిల్లలకు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మల్లి, విజయనగరం జిల్లా భద్రగిరి, విశాఖ అరకు, తూర్పుగోదావరిలో మారేడుమిల్లి, చింతూరు, గుంటూరులో నాగార్జునసాగర్, ప్రకాశంలో యర్రగొండపాలెం, నెల్లూరులో చిట్టేడు, సోమశిల, కర్నూలులో మహానందిలలో ప్రత్యేక గురుకుల పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఒక్కో పాఠశాలలో 640 సీట్లకు గానూ నేటివరకూ 120 నుంచి 130 సీట్లు కూడా భర్తీ కావటం లేదు. 

100 శాతం సీట్ల భర్తీయే లక్ష్యం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో చదువుల విప్లవం తెచ్చారు. చదువులను ప్రోత్సహించేలా నాడు–నేడు వంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఆగష్టు 14 నాటికి 100 శాతం అడ్మిషన్లు సాధించడం కోసం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. ఇందుకోసం ప్రత్యేక బృందాలు గిరిజన తండాలు, గూడెంలలో పర్యటిస్తున్నాయి. జగనన్న విద్యా కానుక కిట్‌లు, అమ్మ ఒడి, కాస్మొటిక్‌ కిట్‌లు తదితర ప్రోత్సాహకాల గురించి అక్కడి వారికి వివరిస్తున్నాం. గురుకులాల్లో విద్యతోపాటు నైపుణ్యాభివృద్ధి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వీయ రక్షణకు శిక్షణ, యోగా, అటల్‌ థింకరింగ్‌ ల్యాబ్‌లు వంటి కార్యక్రమాల గురించి అవగాహన కల్పించి పిల్లల్ని బడికి పంపేలా ప్రోత్సహిస్తున్నాం. 
– కె. శ్రీకాంత్‌ ప్రభాకర్,ఏపీ గిరిజన గురుకుల సంక్షేమ విద్యాలయాల సంస్థ కార్యదర్శి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement