
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఆర్‌ఈఐఎస్) నిర్వహిస్తున్న పాఠశాలల్లో 2022–23 విద్యాసంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో ప్రవేశానికై లాటరీ పద్ధతిలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని సంస్థ రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదివారం ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేశారు.
రాష్ట్రంలోని 12 సాధారణ, 11 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను జూలై 5వ తేదీన ఆటోమేటెడ్ ర్యాండమ్ సెలక్షన్ (లాటరీ) పద్ధతిలో విద్యార్థులకు కేటాయిస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు ఏపీఆర్‌ఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా రూ.50 రుసుం చెల్లించి, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు.
ఆయా తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో దిగువ తరగతులు చదివి ఉండాలని వివరించారు. తల్లిదండ్రుల ఆదాయ పరిమితి ఏడాదికి రూ.లక్షకు మించి ఉండరాదని, తెలుపు రేషన్‌కార్డు కలిగిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఖాళీల వివరాలకు సంస్థ వెబ్‌సైట్ సందర్శించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment