‘గురుకుల్’లో లక్ష్మణ్ సందడి
మొయినాబాద్ సమీపంలోని స్వామినారాయణ్ గురుకుల పాఠశాలలో భారత జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సందడి చేశారు. సోమవారం ఆయన పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. సరదాగా వారితో కాసేపు క్రికెట్ ఆడారు.
మొయినాబాద్ రూరల్: భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి పౌరుడూ పాటుపడాలని ప్రముఖ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సోమవారం మండలంలోని హిమాయత్‌నగర్ సమీపంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో క్రికెట్ ఆడారు.
ఈ సందర్బంగా ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
హైదరాబాద్‌కు అతిచేరువలో ఉన్న ఇంతటి ఘనమైన విద్యాలయాన్ని చూడడం ఇదే మొదటిసారి అన్నారు. క్రీడలకు అధిక ప్రాధ్యాన్యం ఇవ్వాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఆటలతోపాటు చదువులోనూ ఉత్తమ ఫలితాలు సాధించి దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని పేర్కొన్నారు. చిన్న వయసులోనే భగవద్గీత పఠనంతో తన జీవితం ధన్యమైందని తెలిపారు. మహానుభావుల జీవిత చరిత్రలను ఆదర్శంగా తీసుకుని, సామాజిక సేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం గురుకుల విద్యాలయ స్వామీజీలు లక్ష్మణ్‌ను సన్మానించారు. గురుకుల విద్యాలయంలో నిర ్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందినవారికి లక్ష్మణ్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీదేవప్రసాద్ స్వామీజీ, శక్‌వల్లభ్ స్వామీజీ, అధ్యాపకులు పాల్గొన్నారు.