సరిగ్గా ఐదు నెలలకు కథ సుఖాంతం
షిమ్లా: ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం కారణంగా కాన్పు సమయంలో జరిగిన చిన్న పొరపాటుతో ఇద్దరు తల్లుల పిల్లలు తారుమారయ్యారు. అయితే ఐదు నెలలపాటు ఆ చిన్నారుల పేరేంట్స్ చేసిన కృషి ఫలించింది. చివరికి కథ సుఖాంతమైంది. ఆ వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలోని కమలా నెహ్రూ జననీ, శిశు సంరక్షణ ఆస్పత్రికి దాదాపు ఐదు నెలల కిందట సరిగ్గా మే 26న ఇద్దరు గర్భవతులు వచ్చారు. అందులో ఓ జంటకు బాబు, మరో జంటకు పాప పుట్టింది. కానీ ఎక్కడో లోపం జరిగింది. చిన్నారులు తల్లి నుంచి తారుమారయ్యారు.
అయితే తమ వద్ద ఉన్నది వేరొకరి సంతానమని తెలుసుకున్న వీరి తల్లిదండ్రులు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 21న హైకోర్టు ఆదేశాల మేరకు డీఎన్ఏ టెస్టులు చేసి బిడ్డలు మారిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ 26లోగా వారి వివరాలు తెలుసుకుని చిన్నారులను వారి అసలైన పేరేంట్స్ కు అందించాలని హైకోర్టు ఆ ఆస్పత్రికి చెప్పింది.
ఖాలిని ఏరియాలో ఉండే జంటకు, అంజనా ఠాకూర్ అనే స్టాఫ్ నర్స్ దంపతులకు ఆస్పత్రికి రావాలని కబురందింది. నిన్న (బుధవారం) అంజనా వద్ద ఉన్న బాబును ఖాలిని ఏరియా దంపతులకు ఇచ్చి, వారి వద్ద పెరుగుతున్న బాలికను నర్స్ దంపతులకు అప్పజెప్పారు. మే 26(పుట్టినరోజు)న తమ నుంచి వేరయిన తమ పాప సరిగ్గా ఐదు నెలల కిందట ఆక్టోబర్ 26న తమ చెంతకు చేరడంతో అంజనా ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిడ్డల తారుమారు ఘటనపై దోషులెవరో కనుక్కొని శిక్షించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.