ప్రాణాలు కాపాడిన ఆ ముగ్గురు హీరోలు
దీనానగర్: సత్పాల్, దర్శన్ కుమార్, నానక్ చాంద్‌లు మొన్నటి వరకు అందరిలాగే సాధారణ పౌరులు. వారు నేడు హీరోలు. సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ప్రదర్శించి వందలాది మంది అమాయకుల ప్రాణాలను రక్షించిన ప్రాణదాతలు. పంజాబ్‌లోని దీనానగర్‌లో సోమవారం దాదాపు పదకొండు గంటలపాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఏడుగురు ప్రాణాలను తీసిన ముష్కరులను తుదకు పోలీసులు మట్టుబెట్టిన విషయం తెల్సిందే.
ఆ రోజు ఉదయం ఐదున్నర గంటలకే దీనానగర్‌లో ప్రవేశించిన ముగ్గురు టెర్రిరిస్టులు వందలాది మంది ప్రాణాలు బలిగొనేందుకు ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పఠాన్‌కోట్-అమృత్సర్ రైల్వే స్టేషన్ల మధ్యనున్న వంతెనపై ఐదు బాంబులను అమర్చడం, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి వంతెన మీది నుంచి వెళ్లడానికి సరిగ్గా ఐదు నిమిషాల ముందు రైలును ఆపేయడం ద్వారా వందలాది మంది ప్రాణాలను రక్షించడమూ తెల్సిందే. రైల్వే గేట్‌మేన్ సత్పాల్, రైల్వే ఉద్యోగి దర్శన్ కుమార్‌లు ఇందుకు కారణం.
‘నేను రోజులాగే పాల ప్యాకెట్ తెచ్చుకునేందుకు రైల్వే వంతెన సమీపం నుంచి వెళుతున్నాను. నాకు అనుమానాస్పదంగా వంతెనపై వైర్లు కనిపించాయి. వెంటనే నేను ఓ యువకుడి ద్వారా రైల్వే సిబ్బందికి సమాచారం పంపించాను. అప్పుడు డ్యూటీలో వున్న దర్శన్ కుమార్ తక్షణమే స్పందించారు. ఆయన వంతెన వద్దకు రైల్వే గార్డ్‌ను పంపించి అప్పుడు అటువైపు వస్తున్న రైలును ఆపించి ఎంతోమందికి ప్రాణదాతయ్యారు.
‘దాదాపు 250 మంది ప్రయాణికులతో పర్మానంద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ ప్యాసెంజర్ రైలు బయల్దేరిన విషయాన్ని తెలుసుకున్నాను. వెంటనే ఆ రైలును వంతెనకు ఆవలనే ఆపాల్సిందిగా చెప్పి గార్డ్‌ను పంపించాను. సకాలంలో గార్డ్ అక్కడికి చేరుకొని రైలును ఆపేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిపోయింది’ అని దర్శన్‌కుమార్ మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అటువైపుగా వచ్చే అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను రక్షించగలిగామని ఆయన చెప్పారు.
మరో హీరో పంజాబ్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్ డ్రైవర్ నానక్ చాంద్. ఆయన ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి 70 మంది బస్సు ప్రయాణికులను రక్షించారు. ఆ రోజు సంఘటన గురించి ఆయన మాటల్లోనే....
‘నేను జీవితంలో ఏదోరోజు టెర్రరిస్టులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. సైనిక దుస్తుల్లో చేతిలో తుపాకీ పట్టుకొని, ముఖానికి ముసుగు ధరించిన వ్యక్తి హఠాత్తుగా బస్సు ముందుకొచ్చాడు. తుపాకీతో బస్సుపైకి కాల్పులు జరిపి, బస్సును ఆపాల్సిందిగా సైగ చేశాడు. ముఖానికి ముసుగు ధరించాడంటే అతను సైనికుడు కాదు, టైస్టు అయివుంటాడని భావించాను. బస్సును ఆపకుండా అతివేగంగా అతని వైపు తీసుకెళ్లాను. అతను చివరి నిమిషంలో పక్కకు తప్పుకున్నాడు. అదే వేగంతో బస్సును పరుగెత్తించి గురుదాస్‌పూర్ పట్టణంవైపు 20 కిలోమీటర్లు తీసుకెళ్లాను. టైస్టు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు’ అని నానక్ చంద్ వివరించారు. ఆ రోజు బమియల్ నుంచి చండీగఢ్‌కు వెళుతున్న బస్సుకు నానక్ చంద్ డ్రైవర్‌గా ఉన్నారు.