కొండలెక్కి... పొలం గట్లపై నడిచి
= కాలినడకన సబ్ కలెక్టర్ పర్యటన
= మైనింగ్ భూముల పరిశీలన
= కోతుల సమస్యపై వినతులు
నాతవరం, న్యూస్‌లైన్ : సబ్‌కలెక్టర్ శ్వేత తెవతియ శుక్రవారం మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కొండగుట్టలపై నడిచి వెళ్లి గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్నారు. ముందుగా శృంగవరం గ్రామంలో మైనింగ్ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న సర్వే నంబరు 183/1లో గల భూమిని ఆమె పరిశీలించారు. ఆ సమయంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకుని అయిదేళ్లుగా ఈ ప్రాంతంలో కోతులు రూ.లక్షల విలువైన వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్నాయన్నారు.
నీలం తుపానుతో పైలవాని చెరువుకు గండి పడినా పూడ్చివేత పనులు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం చెరువులో నీరు బయటికి పోతుండటంతో, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో చెరువులో నీరు లేక అనేక ఇబ్బందులు పడ్డామని రైతు నాగరాజు వివరించాడు. గండిపడిన ప్రాంతానికి సబ్‌కలెక్టర్‌ను తీసుకెళ్లి చూపించాడు. అనంతరం సబ్ కలెక్టర్ శృంగవరం గ్రామ సమీపంలో మైనింగ్ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న భూముల్లో సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లారు. ఏపీపురం గ్రామంలో సర్వే నంబర్ 116/1లో, జిల్లేడిపూడిలోని సర్వే నంబరు 69లో 50 ఎకరాల కొండ ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం మన్యపురట్ల గ్రామ సమీపంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలువలు దాటుకుంటూ గట్లపై నడుచుకుంటూ వెళ్లి సర్వే నంబర్ 433లో 5 ఎకరాల 70 సెంట్ల బంజరుభూమిని పరిశీలించారు. ఆమె వెంట తహశీల్దారు వి.వి.రమణ, నర్సీపట్నం డీఎఫ్‌వో రామ్మోహనరావు, రేంజర్ మస్తాన్‌వలి, అటవీ శాఖాధికారి కోటేశ్వరరావు, సర్వేయర్ రామారావు, ఆర్ఐ టి.వి.ఎల్.రాజు, వీఆర్వోలు అప్పారావు, సుబ్బయ్య, లక్ష్మి, మైనింగ్‌శాఖ అధికారులున్నారు.
కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు
నాతవరం, న్యూస్‌లైన్: నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో జనవరి నుంచి కో తుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సబ్‌కలెక్టర్ శ్వేతాతెవతియ అన్నారు. ఆమె శుక్రవారం మండలంలో పర్యటన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏ మండలంలో చూసినా ప్రధాన సమస్యగా కోతుల గురించే రైతు లు చెబుతున్నారన్నారు. అటవీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. కలెక్టర్ అనుమతులు వచ్చిన వెంటనే వచ్చే ఏడాది జనవరి నెలలో అన్ని మండలాల్లో ప ర్యటించి కోతులను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టనున్నట్టు తెలిపారు. ఏడో వి డత భూపంపిణీలో 1630 ఎకరాల భూముల పంపిణీకి చర్యలు చేపట్టామన్నారు.