యాదాద్రిలో ఘనంగా జరుగుతున్న అమ్మవారి పూజలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున స్వయంభూలను కొలిచిన ఆచార్యులు.. ప్రధానాలయంలోని ముఖ మండపంలో 108 బంగారు, వెండి కలశాలలో శుద్ధజలం, సుగంధ ద్రవ్యాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటితో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకించారు.
అమ్మవారి సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు
అంతకుముందు హోమం నిర్వహించారు. భక్తులు గిరిప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, అధికారులు గజివెల్లి రఘు, దొమ్మాట సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కనుల పండువగా ఊంజలి సేవ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఊంజలి సేవ కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టించి ఊంజలి సేవ చేపట్టారు.