ఆళ్లగడ్డ ఫలితాలు అద్భుతం
- 2 స్థానాల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవం
- మిగిలిన 18 స్థానాల్లోనూ 16 వైఎస్సార్సీపీ కైవసం
- 2 స్థానాలకే పరిమితమైన టీడీపీ
ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: ఆళ్లగడ్డ నగర పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు ఆవిష్కృతమయ్యాయి. మొత్తం 20 స్థానాల్లో 18 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వశమయ్యాయి. కేవలం రెండు స్థానాల్లోనే టీడీపీ గెలించింది. నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులుండగా 2 వార్డులు ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. దీంతో 18 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అందులోనూ 16 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతం ఎగురవేశారు. కేవలం 2 స్థానాల్లో టీడీపీ గెలిచింది.
నగరపంచాయితీ పరిధిలో 28,861 ఓట్లు ఉండగా 21,908 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు 12,842 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థులకు 8,676 ఓట్లు వచ్చాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4,166 ఓట్ల ఆధిక్యం లభించినట్లు అయింది. 1వ వార్డులో రమణమ్మ అత్యధికంగా 709 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 18వ వార్డులో సరోజమ్మ కేవలం 7 ఓట్లతో గొలుపొందారు.
శోభా నాగిరెడ్డికి అంకితం ఇస్తాం
తమ గెలుపు కోసం కృషి చేసిన దివంగత నేత శోభా నాగిరెడ్డికి ఈ విజయాన్ని అంకితమిస్తున్నామని వైఎస్సార్సీపీ అభ్యర్థులు పేర్కొన్నారు. 17వ వార్డుకు ఎన్నికైన ఎద్దుల ఉషారాణి మాట్లాడుతూ ఆళ్లగడ్డలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాలని శోభానాగిరెడ్డి చెప్పేవరాని అన్నారు. స్వీప్ చేయలేకపోయిన రికార్డు మెజార్టీ రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ విజయంలో దివంగత శోభానాగిరెడ్డి కృషి ఉందని తెలిపారు.
5వ వార్డుకు ఎన్నికైన రామలింగారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం శోభానాగిరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. 6వ వార్డుకు ఎన్నికైన గీత మాట్లాడుతూ శోభానాగిరెడ్డి చిరునవ్వు, ఆప్యాయతలే తమ విజయానికి నాంది అన్నారు. ఆమె భౌతికంగా లేకపోవడంతో విజయాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నామన్నారు. 1వ వార్డుకు ఎన్నికైన రమణమ్మ చింతకుంటలో గెలుపును శోభానాగిరెడ్డి చూడలేకపోయినందుకు బాధగా ఉందన్నారు.