swiming
-
కాళ్లకు తాడు కట్టుకుని బావిలో ఈత.. ఎలా సాధ్యం?
తగరపువలస (భీమిలి): రీసు అప్పన్న అలియాస్ శివయ్య పుట్టుకతోనే పోలియో బాధితుడు. నిరక్షరాస్యుడైన ఆయనకు ఎడమచేయి పూర్తిగా లేదు, కుడిచేతికి రెండు వేళ్లు మాత్రమే. ప్రస్తుతం తనకంటూ ఎవరూలేరు. శివయ్య మొదట్లో విద్యుదీకరణ పనులలో సహాయకుడిగా ఉండేవాడు. ఆరేళ్ల క్రితం దాతల సాయంతో భీమిలి మండలం అన్నవరం–అమనాం పంచాయతీల మధ్య బసవపాలెంలో బసవేశ్వరుని పేరుతో శివాలయం నిర్మించాడు. అంతేకాదు శివాలయం నుంచి ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ 300 మందికి భీమిలి, తగరపువలసలలో ఆహార పొట్లాలు పంచుతూ ఉంటాడు. ఈతే రాని శివయ్య 15 ఏళ్ల క్రితం నదిని దాటుతుండగా తేలుతూ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తాను ఈదకపోయినా నీటిపై తేలగలనని రుజువయినట్టు శివయ్య తెలిపాడు. కాళ్లకు తాడు కట్టుకుని.. సాధారణంగా ఈతకు దిగేవారు కాళ్లతో, చేతులతోనూ ఈదుతుంటారు. కానీ శివయ్య కాళ్లతో కూడా ఈదే అవకాశం లేకుండా తాళ్లతో కట్టేసుకుంటాడు. బావిలో దూకిన తరువాత ఒక్కసారి మునిగి వెంటనే తేలుతుంటాడు. దీంతో శివయ్యలో ఏదో తెలియని రహస్యం ఉందని పలువురు అంటున్నారు. ఈయన నీటిపై తేలితే చూడటానికి పలువురు వస్తుంటారు. నిరక్షరాస్యుడైన శివయ్య తాను నిర్మించిన ఆలయంలో స్వయంగా శివలింగానికి అష్టోత్తరాలు, పూజలు జరిపిస్తుంటాడు. బావిలోని నీటిపై తేలుతున్న శివయ్య సాధన చేస్తే నీటిపై తేలవచ్చు నీటిలో దేనినైనా తేల్చి ఉంచగల శక్తి గాలికి ఉంది. మనకు ఉన్న రెండు ఊపిరితిత్తులు తమ సామర్థ్యంలో 60 శాతం గాలిని మాత్రమే శ్వాస ద్వారా పీల్చుకుంటాయి. ప్రతిరోజూ బోర్లా పడుకుని గట్టిగా గాలి పీల్చుకుని రెండు నిముషాల తరువాత విడుదల చేస్తే ఛాతీ విశాలమవుతుంది. దీంతో మిగిలిన 40 శాతం గాలి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. పూర్వీకులు ఇలా సాధన చేసి ఊపిరి బిగబట్టి నీళ్లపై బాసింపట్లు వేసుకుని కూర్చునేవారు. నీటి ఉపరితలంపై ఎక్కువ భాగాన్ని ఆక్రమించుకోవడం ద్వారా తేలవచ్చు. నాణెం మునగడానికి, పడవలు తేలడానికి ఇదే సూత్రం పనిచేస్తుంది. –డాక్టర్ ఎన్.ఎల్.రావు, సీనియర్ వైద్యుడు కాళ్లకు తాడు కట్టుకుని బావిలో శివయ్య బావిలో నిలువుగా శివయ్య -
ప్రాణం తీసిన ఈత సరదా..
సాక్షి,బేతంచెర్ల: స్నేహితులతో సరదాగా ఈతకెళ్లిన ఓ విద్యార్థి మృత్యువాతపడ్డాడు. మండల పరిధిలోని బలపాలపల్లె గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. పెద్దనాగి గాల్ల చిన్న మద్దయ్య, దస్తగిరమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడో వాడైన నరసింహ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బుధవారం తోటి మిత్రులతో కలిసి హెచ్. కొట్టాల గ్రామ సమీపాన ఉన్న పొలం నీటి తొట్టిలో ఈతకొట్టేందుకు వెళ్లారు. నరసింహకు సరిగా ఈత రాకపోవడంతో తొట్టిలోని నీటిలో మునిగిపోయాడు. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని నరసింహను బయటకు తీసి హుటాహుటిన బేతంచెర్ల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడిని మింగేసిన నీటి బకెట్ సి.బెళగల్: బుడిబుడి అడుగులతో సందడి చేసిన చిన్నారి అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న నీటి బకెట్ మృత్యుపాశమై ప్రాణాలు తీసింది. ఈ విషాదకర ఘటన సి.బెళగల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న రాజు, ఇందిరలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. భర్త రాజు బుధవారం తన పనులు ముగించుకుని ఇంట్లో నిద్రిస్తుండగా, భార్య దుస్తులను శుభ్రపరిచేందుకు బకెట్లో నీటిని నింపింది. అయితే ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో ఆమె కూడా ఇంట్లో నిద్రించింది. కాగా రోజులాగానే ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్న కుమారుడు ప్రియానంద్ (2) మధ్యాహ్న సమయంలో నీటి బకెట్లో తలక్రిందులుగా పడి మృతి చెందాడు. నిద్రలేచిన తల్లిదండ్రులు నీటి బకెట్లో పడి ఉన్న కుమారుడిని చూసి వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలపటంతో బోరున విలపించారు. వారి రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. -
మానుకోటలో విషాదం
సాక్షి, మహబూబాబాద్ : ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. శనిగాపురం బోధ్ తండాకు చెందిన నలుగురు చిన్నారులు శనివారం సాయంత్రం తుమ్మల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ వీరంతా చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఒకే గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు మృత్యువాత పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. మృతులు : 1,ఇస్లావత్ లోకేష్ (10) 2,ఇస్లావత్ ఆకాష్ (12) 3, బొడా దినేష్ ( 10) 4,బొడా జగన్ (14) -
హోసూరులో విషాదం
- నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి పత్తికొండ రూరల్: ఈత కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటి కుంట మింగేసింది. ఈ విషాద ఘటన పత్తికొండ మండలం హోసూరులో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తూర్పుగేరి రంగస్వామి కుమారుడు కార్తీక్ (10), పెద్దహుల్తి భాస్కర్ కుమారుడు మధు (9)తో పాటు మరో ఇద్దరు చిన్నారులు ఈత సరదా కోసం గ్రామ శివారులోని ఓ రైతు పొలంలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లారు. ఆటలాడుకుంటూ కుంటలోని లోతును గమనించలేక కార్తీక్, మధు మొదట నీళ్లలోకి దిగారు. ఇటీవలే కురిసిన వర్షం నీళ్లతో ఉన్న కుంటలో పూడిక ఎక్కువగా ఉండటంతో నీళ్లలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక మునిగిపోయారు. బయట గట్టుపై ఉన్న మరో ఇద్దరు ప్రమాద విషయాన్ని గమనించి గ్రామానికి వెళ్లి కొందరికి చెప్పారు. గ్రామస్తులు వచ్చేలోగా చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. పత్తికొండ ఎస్ఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పుత్రశోకంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు : వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రంగస్వామి, నరసమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు మౌనిక, మంజుల కాగా కార్తీక్ చివరి సంతానం. అదే కాలనీకి చెందిన భాస్కర్, జయమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు పవన్, మధు, రఘు సంతానం కాగా మధు రెండో సంతానం. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను నీటి కుంట బలిగొనడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. చిన్నారుల మృతితో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ప్రాణం తీసిన ఈత సరదా
బావిలో మునిగి డిగ్రీ విద్యార్థి మృతి సంజామల: ఈత సరదా ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొంది. సంజామల సాలెపేటకు చెందిన మాదుగొండు చిన్న నరసయ్య, సుబ్బలక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నరేష్(20) వేసవి సెలవులు కావడంతో స్థానిక కోటవీధిలోని మంగళిబావిలో స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి మునిగి గల్లంతయ్యాడు. నీటిలో మునిగిన స్నేహితుడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి స్నేహితులంతా భయబ్రాంతులకు లోనై కేకలు వేశారు. బావిలో నీరు లోతుగా ఉండడంతో స్థానికులు సుమారు రెండుగంటలు పాటు నీటిలో గాలించినా ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. బావి లోతుగా ఉండడంతో ఈతగాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో బావిలో నీటిని బయటకు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. డిగ్రీ వరకు చదువుకున్న నరేష్ సైనికునిగా దేశసేవకు వెళ్లాలని ప్రయత్నాలు చేశాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: కలుగోట్ల గ్రామ సమీపంలోని బావికి ఈతకు వెళ్లిన ఓ బాలుడు అందులో మునిగి మృత్యువాతపడ్డాడు. ఎమ్మిగనూరు ఖబరస్తాన్ కాలనీకి చెందిన షేక్షావలి(లేట్), నూర్జహన్ దంపతుల కుమారుడు షాదిక్(8) మానసికస్థితి సరిగా లేకపోవడంతో స్కూల్‌కు కూడా వెళ్లేవాడు కాదు. తల్లి నూర్జహన్ కూలీ పనులకు వెళ్లేది. ఆదివారం కాలనీలోని పిల్లలతో కలసి స్నానం చేసేందుకు బావికి వెళ్లాడు. ఈత సరిగా రాకున్నా బావిలోకి దూకడంతో నీటిలో మునిగిపోయాడు. తోటి పిల్లలు కేకలు వేయడంతో పరిసరాల్లో ఉన్న వారు వచ్చి బావిలోకి దూకి బయటకు తీశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహం దగ్గర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
విహార యాత్రలో విషాదం
వెలుగోడు: సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు అంతా విహారయాత్రకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వెళ్లగా విషాదం చోటు చేసుకుంది. వారి ఇళ్లలో ఏదైనా వివాహం జరిగితే అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లి సంతోషంగా గడపటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో పట్టణానికి చెందిన ఇనాయతుల్లా కుటుంబం ఆదివారం వీబీఆర్ పరిధిలో మద్రాస్ కాల్వ వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఇనాయతుల్లా కుమారుడు ముక్కరం(14) ఈత కొడుతూ ప్రమాదశాత్తూ లోతైన గుంతలో ఇర్కుకొని ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించి ఫలితం దక్కలేదు. ఈ ఘటన పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అలాగే ఉరుసు సమయం కావడంతో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు వీబీఆర్ వద్ద విహార యాత్రకు వచ్చారు. ఇలాంటి తరుణంలో ముక్కరం మృత్యువాత స్థానికులను కలవరానికి గురి చేసింది. విద్యార్థి స్థానిక మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇనాయతుల్లా దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం కాగా ఉన్న కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. -
ప్రాణం తీసిన సరదా
కేసీ కెనాల్లో ఈతకు వెళ్లి యువకుడి మృతి నందికొట్కూరు: సరదాగా స్నేహితులతో కలిసి ఈత కెళ్లిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం నాగటూరు గ్రామం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నందికొట్కూరు పట్టణంలోని లింగం వీధికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మౌలాలి కుమారుడు మౌలిబాషా(22) అదేవీధికి చెందిన అమ్మాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే శనివారం రాత్రి నాగటూరు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆదివారం ఉదయం నలుగురు స్నేహితులతో కలిసి కేసీ కెనాల్‌కు సరదాగా ఈతకు వెళ్లారు. అయితే, ఈతకొడుతూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు వదిలాడు. తోటి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడి మృత దేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. -
మహేష్‌కు నెహ్రూ పురస్కారం
మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామానికి చెందిన చిన్నారి మహేష్‌కు చాచా నెహ్రూ పురస్కారం లభించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సుందరయ్య కళామందిరంలో ఆదివారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, హైకోర్టు న్యాయమూర్తి ఏ.వి.శేషసాయి, లక్ష్మిపార్వతి.. తదితర ప్రముఖుల చేత అవార్డు అందుకున్నాడు. బండిఆత్మకూరు మండలం వెంగళరెడ్డిపేట గ్రామానికి చెందిన మద్దిలేటి కుమారుడు వెంకటాపురం మహేష్ చిన్నతనంలోనే ఈతలో ప్రావీణ్యం చూపిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని ఎఫ్ ఎస్ సూర్యనారాయణ మాస్టర్ స్థాపించిన ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధులుగా వచ్చిన వారు అవార్డును అందించినట్లు మహానందీశ్వర పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్‌ను పాఠశాల కరస్పాండెంట్‌తో పాటు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
ఉప్పునీటి బావే ఊపిరి తీసింది
నందికొట్కూరు: మండల పరిధిలోని దామగట్ల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి మోహన్(15)ను గ్రామంలోని ఉప్పునీటి బావి బలితీసుకుంది. అసలే మూగవాడు, ఆపై ఈతకు వెళ్లి బావిలో మునిగిపోయాడు. కేకలు వేసే అవకాశం కూడా లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. నాగముని, సాలమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, మూగవాడైన కుమారుడు మోహన్ ఉన్నారు. సోమవారం స్కూల్లో జెండా వందనం చేసిన తర్వాత స్నేహితులతో కలిసి పంచాయితీ బోర్డు పక్కన ఉన్న ఉప్పునీటి బావిలో ఈతకు వెళ్లాడు. అందరూ కలిసి ఈత కొడుతుండగా మోహన్ ఉన్నట్టుండి నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని గమనించినప్పటికీ పెద్దలు కొడతారనే భయంతో స్నేహితులంతా ఎవరికివారు ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని నీటిలో గాలించి తీసేసరికి ప్రాణాలు కోల్పోయాడు. -
గండిపేట చెరువులో ముగ్గురు యువకుల గల్లంతు
హైదరాబాద్ : ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. హైదరాబాద్ గండిపేట చెరువులోకి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు హుమాయున్ నగర్‌కు చెందిన అబ్దుల్, సల్మాన్, సతీష్లుగా గుర్తించారు. దీంతో మృతుల నివాసాల్లో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.