ప్రాణం తీసిన ఈత సరదా
బావిలో మునిగి డిగ్రీ విద్యార్థి మృతి
సంజామల: ఈత సరదా ఓ డిగ్రీ విద్యార్థిని బలిగొంది. సంజామల సాలెపేటకు చెందిన మాదుగొండు చిన్న నరసయ్య, సుబ్బలక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నరేష్(20) వేసవి సెలవులు కావడంతో స్థానిక కోటవీధిలోని మంగళిబావిలో స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి మునిగి గల్లంతయ్యాడు. నీటిలో మునిగిన స్నేహితుడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి స్నేహితులంతా భయబ్రాంతులకు లోనై కేకలు వేశారు. బావిలో నీరు లోతుగా ఉండడంతో స్థానికులు సుమారు రెండుగంటలు పాటు నీటిలో గాలించినా ఆచూకీ కోసం వెతికినా లభించలేదు. బావి లోతుగా ఉండడంతో ఈతగాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ సాయంతో బావిలో నీటిని బయటకు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. డిగ్రీ వరకు చదువుకున్న నరేష్ సైనికునిగా దేశసేవకు వెళ్లాలని ప్రయత్నాలు చేశాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.