టీచర్ మందలింపు నలుగురు విద్యార్థినుల ప్రాణం తీసింది. మార్కులు తక్కువ వచ్చాయని వారి తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకురావాలని ఆ విద్యార్థినులను ఇంటికి పంపారు. ఈ విషయం కన్నవారికి చెప్పలేక టీచర్ పోరు పడలేక భయంతో ఆ విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తమ బిడ్డలు పాఠశాలకు వెళ్లారనుకున్న ఆ తల్లిదండ్రులకు శోకం మిగిల్చారు. ఈ విషాద ఘటన అరక్కోణంలో చోటుచేసుకుంది.
అరక్కోణం: మార్కులు తక్కువగా రావడంతో విద్యార్థినులను మందలించడం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. తోటి విద్యార్థుల ముందు మందలించడం, తల్లిదండ్రులను పిలుచుకుని పాఠశాలకు రావాలని ఉపాధ్యాయుడు చెప్పడంతో భయంతో నలుగురు ఇంటర్ విద్యార్థినులు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. అరక్కోణం డివిజన్ నెమిలి తాలుకా పనపాక్కంలోని ప్రభుత్వ మహోన్నత పాఠశాల్లో దాదాపు 1,300మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఏడాది ప్లస్ ఒన్‌కు సైతం పబ్లిక్ పరీక్షలు కావడంతో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థులకు మాసాంతర పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను ఉపాధ్యాయులు శుక్రవారం మందలించి, తల్లిదండ్రులతో పాఠశాలకు రావాలని ఇంటికి పంపారు. అలా వెళ్లిన వారిలో పనపాక్కం పట్టణానికి చెందిన ప్లస్‌ఒన్ విద్యార్థినులు దీప(16), మణిష, శంకరి, రేవతి తల్లిదండ్రులు ఎమంటారో అని భయంతో ఆందోళనకు గురయ్యారు.
ఆందోళనలో వారు తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులను తీవ్ర శోకానికి గురిచేసింది. ఇంటికి వెళ్లే మార్గంలో పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలోని రామాపురం వద్ద ఉన్న 60 అడుగుల బావిలో దూకి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు ఇళ్లకు రాకపోవడంతో తోటి విద్యార్థుల వద్ద ఆరాతీయగా ఉపాధ్యాయులు మందలించిన విషయం తెలిసింది. వారి కోసం గాలించగా పాఠశాలకు వెళ్లే మార్గంలో బావి వద్ద విద్యార్థినుల సైకిళ్లు కనిపించాయి. బావిలో చూడగా శవాలుగా పడిఉన్న విద్యార్థినులను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అరక్కోణం, వాలాజా నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నాలుగు గంటల పాటు శ్రమించి విద్యార్థినుల మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వాలాజా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పనపాక్కం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment