విద్యార్థి ఊపిరి తీసిన ఈత సరదా..
కందుకూరు : సరదాగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృత్యువాతపడ్డాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం పట్టణంలో జరిగింది. మృతుడి స్నేహితుల కథనం ప్రకారం.. అద్దంకి మండలం దామావారిపాలేనికి చెందిన కొండమీది బ్రహ్మయ్య కుమారుడు కె.ఫణీంద్ర (22) పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మెకానికల్ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పట్టణంలోని కోవూరు రోడ్డులో స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.
శనివారం మిడ్ ఎగ్జామ్స్ ఉండటంతో కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం మూడు గంటల వరకూ కాలేజీలోనే ఉన్నాడు. అనంతరం గదికి వచ్చిన ఫణీంద్ర స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. పట్టణంలోని సమ్మింగ్‌పూల్ సమీపంలో, జనార్దనకాలనీలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఈత ముగించుకుని స్నేహితులంతా బావి గట్టుకు చేరుకున్నారు. ఇదే సమయంలో పూర్తిస్థాయిలో ఈతరాని ఫణీంద్ర.. మరోసారి ఈత కొడతానంటూ గట్టుపై నుంచి బావిలోకి దూకాడు.
ఇక అంతే బయటకు రాలేదు. అప్రమత్తమైన స్నేహితులు బావిలోకి దిగి ఫణీంద్రను వెతకడం మొదలు పెట్టారు. పూడులో కూరుకుపోయిన ఫణీంద్రను గుర్తించి వెంటనే కోవూరురోడ్డుని హరిణీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. తోటి స్నేహితుడు మృతి చెందాడని తెలుసుకున్న ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఫణీంద్ర మృతదేహాన్ని చూసి విలపించారు.