కుమారుడి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి (ఇన్‌సెట్‌లో) తరుణ్‌కుమార్ (ఫైల్)
పత్తికొండ టౌన్: తోటి విద్యార్థులతో కలిసి సరదాగా ఈతకెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. మద్దికెరకు చెందిన మంగలి రామాంజినేయులు, హైమావతి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు ఎం. తరుణ్‌కుమార్(13) పత్తికొండలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత తరుణ్‌కుమార్ పాఠశాలకు ఎదురుగా ఉండే బావిలో ఈత కొట్టేందుకు తోటి విద్యార్థులతో కలిసి వెళ్లాడు.
ఈక్రమంలో నీటిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోతూ కేకలు వేశాడు. దీంతో తోటి విద్యార్థులు పాఠశాలకు వద్దకు వెళ్లి చెప్పడంతో సీనియర్ విద్యార్థులు వచ్చి బాలుడిని బయటకు తీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ శ్రావణి ధ్రువీకరించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని వారు ఆరోపించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేత మురళీధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, ఎంపీటీసీ శ్రీనివాసులు, నాయకులు కృష్ణ విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment