బోయినపల్లి(చొప్పదండి): ‘సెలవులచ్చినయి దోస్తులు ఈత నేర్చుకుంటుండ్రు.. ఈత నేర్పమంటివి కదా కొడుకా.. కనిపించకుండా పోతివా కొడుకా..’ అని ఆ తల్లి రోదన అక్కడి వారి హృదయాలను కలచివేసింది. ఈత నేర్చుకునేందుకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి చేపూరి మణితేజ(12) బావిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి తిరుమల–గంగయ్యలకు మణితేజ, రిత్విక్ కొడుకులు.
పాఠశాలకు వేసవి సెలవులు రావడంతో ఈత నేర్చుకునేందుకు తండ్రి గంగయ్య, తాత రామయ్యలతో కలిసి గత మూడు రోజులుగా మణితేజ వెళ్తున్నాడు. గ్రామంలోని తాటివనం పరిసరాల్లోని వందురునూతిలో ఓ రోజు తాత, మరో రోజు తండ్రి ఈత నేర్పుతున్నారు. మణితేజ తాత రామయ్య శుక్రవారం గంగాధర మండలం చర్లపల్లికి వెళ్లగా.. తండ్రి గంగయ్యతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. అదే బావిలో మరికొందరు సైతం ఈత కొడుతున్నారు.
ఈక్రమంలో ఈత కొడుతుండగా మణితేజ మునిగిపోయాడు. పది గజాల లోతులో నీళ్లు ఉండడంతో ఎంత వెదికినా బాలుడి ఆచూకీ లభించలేదు. మోటార్లు పెట్టి నీరు తీసే ప్రయత్నం చేసినా ఖాళీ కాలేదు. ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇవ్వగా.. గజ ఈతగాళ్లు వచ్చి తెప్ప సాయంతో మణితేజ మృతదేహాన్ని బయటకు తెచ్చారు. బావిలో మణితేజ గల్లంతయ్యాడని తెలియడంతో గ్రామస్తులందరూ అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీయగానే తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment